తుందుర్రులో టెన్షన్
తుందుర్రు: స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ పనులు కొనసాగిస్తోంది. సర్కారు సహకారంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ యంత్ర సామాగ్రి ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణ ప్రదేశానికి తరలించారు. ఇవాళ కూడా కంటైనర్ల ద్వారా మరికొంత సామాగ్రి తరలించే అవకాశముందని తెలుస్తోంది. ఆక్వాఫుడ్ పార్క్‌ను నిలిపి వేయాలని గత నెలలో సీఎం చంద్రబాబును కలిసి బాధితులు కోరినా ఆయన పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపేది లేదని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో సర్కారు ఆదేశాలతో ముందుస్తుగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమపై దాడి చేశారంటూ 14 మంది ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేక కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేశారు. తుందుర్రు, బేతపూడి, జొన్నలచెరువులో 144 సెక్షన్ విధించి ఆంక్షలు పెట్టారు. బాధిత గ్రామాల్లోకి ఇతరులు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు.
మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. పోలీసు బలగాలతో ఆక్వాఫుడ్ పార్క్‌ను ఎన్నిరోజులు నడుపుతారని ప్రశ్నించారు. దీన్ని తీర ప్రాంతాలకు తరలించాలన్న విజ్ఞప్తిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.