హైలెవల్ టెన్షన్
నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణకు హైలెవల్ కమిటీ!
ఇప్పటికే ఏజీ ఆడిట్ ప్రారంభం
ఆడిట్‌కు సహకరించని కొన్ని శాఖల అధికారులు
జేఎన్‌ఎన్యూఆర్‌ఎంలో అవినీతి బయటపడుతుందనే భయం !
అక్రమార్కుల్లో వణుకు !
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణకు హైలెవల్ కమిటీని నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఈ క్రమంలోనే అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. ఏజీ బృందం నివేదిక ఆధారంగా జనవరిలో హైలెవల్ కమిటీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్(జేఎన్‌ఎన్యూఆర్‌ఎం) పథకాల అమలులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై హైలెవల్ కమిటీతో విచారణ చేయిస్తామని ఈ నెల 13న నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతరం 16న అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ బృందం నగరానికి చేరుకుంది. తమ అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతో కొన్ని శాఖల అధికారులు ఆడిట్ బృందానికి రికార్డులు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. హైలెవల్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపడితే పెద్దలపైనే వేటు పడటం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
బిల్లుల చెల్లింపులో అత్యుత్సాహం !
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ద్వారా యూఐజీ పథకం కింద 11 ప్రాజెక్టులకు రూ.675.33 కోట్లు, 8 బీఎస్‌యూపీ ప్రాజెక్టులకు రూ.743.32 కోట్లు కలిపి 1,418.65 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో సుమారు రూ.1,100 కోట్లతో పనులు చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, తాగునీటి పథకాల పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. గృహ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బీఆర్టీఎస్ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. సకాలంలో పనులను పూర్తి చేయడంపై దృష్టిపెట్టని అధికారులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో మాత్రం అత్యుత్సాహం కనబరిచినట్లు రికార్డులు స్పష్టంచేస్తున్నాయి. కమీషన్ల కోసం కొందరు అధికారులు తమ ఇష్టానుసారం బిల్లులు చెల్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.100 కోట్ల మేర అవినీతి?
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ముసుగులో సుమారు రూ.100 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన పనికి సంబంధించిన ఓచర్లు సుమారు రూ.2 కోట్లు ఉంటే రూ.5 కోట్లు బిల్లులు చెల్లించినట్లు రికార్డుల్లో నమోదైనట్లు సమాచారం. మరోవైపు ఇందుకు సంబంధించి 600 ఓచర్లు కనిపించడం లేదని తెలిసింది. మెజర్‌మెంట్ బుక్స్ మాయమయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు కొందరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు కూడా పొంతన లేని లెక్కలు చెబుతున్నారు. రవిబాబు కమిషనర్‌గా పనిచేసిన కాలంలో పెద్దఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిధుల మళ్లింపు కారణంగా ఇప్పటికీ లెక్కలు తేలని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి నగరపాలక సంస్థకు సుమారు రూ.55 కోట్లు రావాల్సి ఉంది. ఆడిట్ సక్రమంగా జరగని కారణంగా ఆ నిధులను నిలిపివేశారు.
ముప్పేట దాడి
నగరపాలక సంస్థపై ఆడిట్ బృందాలు ముప్పేట దాడికి దిగాయి. స్టేట్ ఆడిట్ ప్రక్రియ రెండు నెలల క్రితమే ప్రారం భమైంది. స్టేట్ ఆడిట్ అధికారులు 2009-10కి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అభ్యంతరాలు ఎక్కువగా తలెత్తినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2010-11కు సంబంధించి ఆడిట్‌ను నిర్వహిస్తున్నారు. ఏజీ ఆడిట్ అధికారులు 2009-10 నుంచి 2012-13 వరకు ఆడిట్ చేయాలని నిర్ణయించారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.