సర్కారుకు అకౌంటెంట్ జనరల్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఒకే మెయిల్ ఐడీ ఇచ్చిన 56,586 మంది విద్యార్థులకు, ఒకే మొబైల్ నంబర్ పేర్కొన్న 25 వేర్వేరు విద్యా సంస్థలకు చెందిన 2,000 మంది విద్యార్థులకు... అందరికీ అధికారులు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించారు. ఒకే మెయిల్ ఐడీతో, మొబైల్ నంబర్‌తో ఇంత మంది విద్యార్థులా..? అని ఆశ్చర్యపోతున్నారా!? ఇది కేవలం 60 కాలేజీలకు సంబంధించి చేసిన ఆడిట్ మాత్రమే. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిర్వహించిన ఈ తనిఖీలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాల అమల్లో ఎన్నో అక్రమాలు, మరెన్నో లోపాలు బయటపడ్డాయి. లక్షలకు పైగా వార్షికాదాయం ఉండి, అనర్హులైన వేల మంది విద్యార్థులకు ఫీజుల చెల్లింపు.. స్పాట్ అడ్మిషన్లు, మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలు పొందిన వారికీ అడ్డదారిలో పథకం వర్తింపు.. అర్హులైన వేలాది మంది విద్యార్థులకు మంజూరు చేయకపోవడం.. వంటి ఎన్నో బాగోతాలు వెల్లడయ్యాయి. ఈ లెక్కన మొత్తం కాలేజీల్లో ఆడిట్ జరిపితే.. మరెన్ని అక్రమాలు బయటపడతాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి.
2009-10, 2010-11, 2011-12 విద్యా సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల వ్యవహారంలో కొన్ని కాలేజీల యాజమాన్యాలు, అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. అధికారులు, యాజమాన్యాలు కుమ్మక్కై పెద్ద సంఖ్యలో విద్యార్థుల ఫీజులను మింగేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఫీజులు, స్కాలర్‌షిప్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనలకు మంగళం పాడిన అధికారులు... దరఖాస్తు చేసుకున్నవారిలో 26 శాతం నుంచి 55 శాతం మందికే మంజూరు చేశారు. మరోవైపు పెద్ద సంఖ్యలో అనర్హులకు ఫీజులు ఇచ్చేశారు. అసలు ఒకే మెయిల్ ఐడీతో దరఖాస్తు చేసుకున్న 56,586 మందికి, ఒకే మొబైల్ నంబరుతో 25 వేర్వేరు విద్యా సంస్థల నుంచి దరఖాస్తు చేసుకున్న రెండు వేల మందికి ఫీజులు ఇచ్చారు. మరి ఈ ఫీజులన్నీ అసలైన విద్యార్థులకే చెల్లించారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నిర్వహించిన ఆడిట్‌లో ఇలాంటి ఎన్నో విస్మయం కలిగించే అంశాలు వెలుగుచూశాయి. 2010 నుంచి 2012 డిసెంబర్ వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల పథకంపై.. అది కూడా కేవలం 60 కాలేజీలకు సంబంధించిన ఆడిట్‌లోనే ఎన్నో అక్రమాలు, తప్పిదాలు బయటపడ్డాయి. ఏజీ కార్యాలయం ప్రభుత్వానికి అందజేసిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలు..
- 2010 నవంబరు నుంచి 2011 డిసెంబరు వరకు 4,156 మంది విద్యార్థుల ఏటీఎం కార్డులు హైదరాబాద్ జిల్లాలోని నాలుగు డివిజన్లలో దొంగతనానికి గురయ్యాయి.
- 471 బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. 17.25 లక్షలను అక్రమంగా డ్రా చేశారు. బ్యాంకుల వారు ఏటీఎం కార్డులతోపాటు పిన్ నెంబర్లను కూడా ఒకే కవర్‌లో పెట్టి ఇవ్వడ ం, వాటిని అర్హులైన విద్యార్థులకు ఇవ్వకపోవడం ఇందుకు కారణం. అర్హులకు ఏటీఎం కార్డులు అందలేదనే సమాచారాన్ని సంక్షేమ శాఖ అధికారులు సకాలంలో బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లలేదు. ఫలితంగా ఆ ఖాతాల్లోని సొమ్మును బ్లాక్ చేయడానికి వీల్లేకుండాపోయింది. ఆ విద్యార్థులు అందుబాటులో లేకపోవడం వల్ల కార్డులు పంపిణీ చేయలేకపోయామని 2012లో సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ వివరణ ఇచ్చారు.
- ఒకే ఈ-మెయిల్ ఐడీతో 2010-11 విద్యా సంవత్సరంలో 56,586 మంది విద్యార్థులు, 2011-12లో 53,518 మంది విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులకు ఫీజు మంజూరు చేశారు.
- 25 వేర్వేరు విద్యా సంస్థలకు చెందిన 1,961 మంది విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఒకే మొబైల్ నంబరును పేర్కొన్నారు. వారికి ఫీజు మంజూరైంది.
- 33,181 దరఖాస్తుల్లో ఎస్‌ఎస్‌సీ యూనిక్ ఐడీ నంబర్లను మళ్లీ మళ్లీ వాడారు. ఒక విద్యార్థికి ఉన్న యూనిక్ ఐడీ మరే విద్యార్థికి ఉండదు.
- మేనేజ్‌మెంట్, స్పాట్ అడ్మిషన్ కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్ మంజూరు చేశారు. 2009-10, 2010-11లో దాదాపు 6 వేల మందికి ఇలా ఇచ్చారు. ఒక 2010-11లోనే 152 మందికి రూ. 56.49 ల క్షలు చెల్లించారు.
- రూ. లక్ష వార్షిక ఆదాయానికి మించి ఉన్న అనేక మంది విద్యార్థులకు ఫీజులు మంజూరు చేశారు.
- కోర్సు కాలపరిమితిని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల 73 మంది మెడికల్ విద్యార్థులకు రూ. 12 లక్షల వరకు మంజూరు చేశారు.
- డాటా, దరఖాస్తు ఐడీ వివరాలు లేకపోయినా 374 మందికి స్కాలర్‌షిప్‌లు ఇచ్చారు.
- మరో రకంగా ఆర్థిక సహాయం పొందే 176 మంది గేట్ క్వాలిఫైడ్ విద్యార్థులకు రూ. 76.82 లక్షలు స్కాలర్‌షిప్ ఇచ్చారు.
విద్యార్థుల నుంచీ వసూళ్లు..!
2009-10, 2010-11, 2011-12 విద్యా సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. పోనీ స్కాలర్‌షిప్ ఇచ్చారా.. అంటే అదీ లేదు. ఆ మూడేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 26% నుంచి 55 శాతం మందికి మంజూరు చేయలేదు. దాంతో యాజమాన్యాలు ఫీజులను విద్యార్థుల నుంచే వసూలు చేశాయి. క్షేత్రస్థాయి ఆడిట్లో 14 శాతం మంది విద్యార్థులు తామే ఫీజులను చెల్లించామని వెల్లడించారు.
ఫీజు మింగేశారు!
Published Tue, Jul 15 2014 2:13 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement