చిక్కుల చిట్టా తేలేనా!
నగరపాలక సంస్థలో 2009 నుంచి ఆడిట్ పెండింగ్
రంగంలోకి దిగిన ఏజీ బృందం
సిబ్బంది సహాయ నిరాకరణ
ఆందోళనలో అక్రమార్కులు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ అధికారులను ఆడిట్ భయం వెంటాడుతోంది. హైదరాబాద్‌కు చెందిన అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆడిట్ అధికారుల బృందం నగరానికి చేరుకుంది. రికార్డులు సిద్ధం చేయాలని వారం రోజుల క్రితమే అదనపు కమిషనర్‌కు ఏజీ అధికారులు సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన అన్ని విభాగాధిపతులను ఆదేశించారు. అయితే ఏజీ బృందం వచ్చి రెండు రోజులైనా వారికి రికార్డులు అందలేదు. దీంతో వారు మంగళవారం కూడా కార్పొరేషన్ వరండాలో కబుర్లతో కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఎన్నికష్టాలు ఎదురైనా నగరపాలక సంస్థ చిక్కుల చిట్టా లెక్క తేల్చిన తర్వాతే వెళ్తామని ఏజీ బృందం స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం తాము రూపొందించిన ఫార్మాట్‌లో 2009 నుంచి 2013 వరకు జమా, ఖర్చుల వివరాలను అందజేయాలని కోరినట్లు సమాచారం. దీంతో కొన్ని శాఖల అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.
గతంలోనూ సహాయ నిరాకరణ
అడ్వాన్సుల్లో గోల్‌మాల్, నిధుల మళ్లింపు, రికార్డులు అప్‌డేట్‌గా లేకపోవడం, ఐటీ రిటర్న్స్‌లో పెండింగ్ వంటి లోపాలు నగరపాలక సంస్థలో ఉన్నాయి. దీంతో ఆడిట్ అనగానే అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీయూఎఫ్‌ఐడీసీ) అధికారుల బృందం గతేడాది జూన్‌లో ఆడిట్ చేపట్టింది. మూడు రోజులైనా రికార్డులు అందజేయకపోవడంతో వారు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్టేట్ ఆడిట్ అధికారులు వచ్చారు. కార్పొరేషన్ అధికారులు వారికి కూడా సహాయ నిరాకరణ చేశారు. పెండింగ్ నిధులు మంజూరు చేయాలంటే ఆడిట్ నివేదిక తప్పనిసరి అని ప్రభుత్వం హెచ్చరించడంతో కాస్త వెనక్కి తగ్గారు. 2009-10 సంవత్సరానికి సంబంధించిన రికార్డుల్ని అందజేశారు. రికార్డుల్లో తప్పులు ఉండటంతో జిల్లా ఆడిట్ అధికారులు కొర్రీ వేసి పంపారు. ప్రస్తుతం దాన్ని సరిచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితమే ఆడిట్ ప్రక్రియ 2010-11 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంతవరకు జమా, ఖర్చుల వివరాలు అందజేయకపోవడంతో స్టేట్ ఆడిట్ బృందం ఖాళీగా ఉంది. ఈక్రమంలో ఏజీ అధికారులకు ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
అంతా ఓ ప్రహసనం
నగరపాలక సంస్థలో ఆడిట్ ఒక ప్రహసనంలా మారింది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఉద్యోగులకు 1994 నుంచి ఇచ్చిన అడ్వాన్సుల్లో రూ.2కోట్లకు సంబంధించి లెక్కలు లేవు. మొదటి అడ్వాన్స్ క్లీయర్ కాకుండా రెండో అడ్వాన్స్ ఇవ్వకూడదనే నిబంధన అమలు కావడంలేదు. అడ్వాన్స్ తీసుకున్న వారిలో కొందరు రిటైర్ కాగా, మరికొందరు మృతిచెందారు. ప్రస్తుతం ఉన్న అకౌంట్స్ అధికారులతో పాటు ఆడిట్ కోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను నియమించారు. అయినప్పటికీ ఆడిట్ పెండింగ్‌లోనే ఉండటం విశేషం. ఐటీ రిటర్న్స్ దాఖల్లో లొసుగులు ఉండటంతో యూనియన్ నాయకులు లోకాయుక్తాను ఆశ్రయించారు. ఈ నెల 18న కేసు విచారణ జరగనుంది. 2012-13, 2013-14 సంవత్సరాలకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రూ.2.24 శాతం చొప్పున కార్పొరేషన్ మినహాయించుకున్న రూ.7.30 కోట్లకు సంబంధించి ఐటీ రిటర్న్స్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.