రూ. 245 కోట్లకు లెక్కేది?
నెలాఖరులోగా లెక్కలు చూపకుంటే జీతాలు నిలిపివేస్తాం
అధికారులను హెచ్చరిస్తూ ఆర్థిక శాఖ జీవో జారీ
సాక్షి, హైదరాబాద్: అత్యవసరాల కోసమంటూ లెక్కా పత్రం లేకుండా ఖజానా నుంచి నిధులను డ్రా చేసుకుని వివరాలు సమర్పించకపోవడం పట్ల అకౌంటెంట్ జనరల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరాల పేరుతో తీసుకున్న డబ్బులకు లెక్కలు సమర్పించకుంటే నిధులను డ్రా చేసిన అధికారులకు జీతాలు నిలుపుదల చేస్తామని ఆర్థిక శాఖ కూడా పలుసార్లు జీవోలు ఇచ్చింది.
అయినా సరే ఇంకా రూ. 245 కోట్లకు పలు శాఖల నుంచి లెక్కలు సమర్పించలేదని ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి ఈ నెల 28వ తేదీలోగా వివరణాత్మక బిల్లులను ఓచర్లతో సహా సమర్పించాలని, లేదంటే వచ్చే నెల జీతాలను ఆయా అధికారులకు నిలుపుదల చేస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
రెవెన్యూ, వ్యవసాయ శాఖల నుంచి ఎక్కువగా లెక్కలు అందాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2,805 సంక్షిప్త ఆకస్మిక బిల్లులకు సంబంధించిన రూ. 245 కోట్లకు ఈ నెల 28వ తేదీలోగా వివరణాత్మక బిల్లును ఎట్టిపరిస్థితుల్లోను సమర్పించేలా చర్యలను తీసుకోవాలని అకౌంటెంట్ జనరల్ గట్టిగా సూచించడంతో ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది.
రాష్ట్రం విడిపోవడానికి ఒక్క రోజు ముందు అంటే గత ఏడాది జూన్ 1వ తేదీ నాటికి 89,020 సంక్షిప్త ఆకస్మిక బిల్లులకు చెందిన రూ.1,051 కోట్లకు లెక్కల పత్రాలు సమర్పించాల్సి ఉంది. అయితే ఆర్థిక శాఖ తీసుకున్న చర్యల కారణంగా ఫిబ్రవరి నాటికి ఆ బిల్లుల సంఖ్య 2,805కి తగ్గింది.