పెన్షనర్ల గుండెల్లో టెన్షన్ | Tension heartburn pensioners | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల గుండెల్లో టెన్షన్

Published Thu, Oct 2 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

పెన్షనర్ల గుండెల్లో టెన్షన్

పెన్షనర్ల గుండెల్లో టెన్షన్

పింఛన్ల జాతరలో లక్షలాది మందికి తెగుతున్న బతుకు ఆధారం
3.34 మంది పింఛన్లను ఏరివేసిన కమిటీలు
‘ఆధార్’ లేదని 1.63 లక్షల మందికి కోత
  కొత్తగా దరఖాస్తు చేసుకున్న 7.74 లక్షల మంది పెన్షన్లపై తేల్చని వైనం
13.18 లక్షల పింఛన్లు ప్రశ్నార్థకం
ఖరారు చేసిన పింఛన్లకైనా బడ్జెట్‌లో సరిపడా నిధుల కేటాయింపుల్లేవు
  {పతి నెలా కావలసింది రూ. 451 కోట్లు.. కేటాయింపు రూ.1338 కోట్లే
 
 టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో 43.12 లక్షల మంది సామాజిక పింఛన్లు అందుకుంటుండగా.. ప్రభుత్వం బడ్జెట్‌లో ఆ పెన్షన్ల కోసం రూ. 1,338 కోట్లు కేటాయించింది. ఇందులో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ పింఛన్ల చెల్లింపులకే రూ. 650 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇక మరో రూ. 688 కోట్లు మాత్రమే ఉంటాయి. సెప్టెంబర్ నుంచి పెంచిన పింఛన్లు చెల్లించాలంటే.. నెలకు సుమారు రూ. 450 కోట్లు చొప్పున రూ. 3,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. కానీ.. బడ్జెట్ కేటాయింపుల ద్వారానే సర్కారు పింఛన్ల చెల్లింపులకు పరిమితులు విధించినట్లయింది. ఆ ప్రకారం.. సాధ్యమైనంత మేర పింఛన్లకు కోత పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ క్రమంలో ఒకటి కాదు, వంద కాదు, వేయి కాదు.. ఏకంగా ఐదు లక్షలకు పైగా పింఛన్లను పరిశీలనల్లో అనేక రకాల సాకులతో నిర్దయగా ఏరిపారేశారు. పింఛన్లకు అర్హులుగా గత ప్రభుత్వం గుర్తించిన 2.61 లక్షల మంది దరఖాస్తులనూ కనికరించలేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో 5.60 లక్షల మందిపైనా దయచూపలేదు. మొత్తం మీద 13 లక్షల మందికి పైగా అర్హులను పెన్షన్లకు దూరం చేశారు. ఈ ఏరివేతలు, కోతలు ఇక్కడితో ఆగే సూచనలు కూడా లేవు. వడపోత కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, అందుకు ‘థర్డ్ పార్టీ’ సాయం కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పింఛన్‌దారుల జీవనాధారంపై ఏరివేత కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంటుందన్నమాట!!

 హైదరాబాద్
 ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు! నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం దాదాపు 13.18 లక్షల మంది పింఛనుదారుల బతుకు ఆధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎన్నికల సమయంలో.. వృద్ధాప్య, వితంతు పెన్షన్‌దారులకు రూ. 1,000 చొప్పున, వికలాంగులకు రూ. 1,500 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత పెరగాల్సిన పింఛనుదారుల సంఖ్యను కుదిస్తోంది. సామాజిక భద్రత పేరుతో ప్రభుత్వాలు అందించే ఈ పింఛన్లలో భారీగా కోతలు పెడుతున్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా పెంచిన పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమవుతుండగా.. రాష్ట్రంలో 13.18 లక్షల మంది పింఛనుదారుల భవితవ్యం గందరగోళంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 43.12 లక్షల పింఛన్లు ఉండగా.. సెప్టెంబరు 18 నుంచి 25వ తేదీ లోపు పరిశీలించిన గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు అనర్హత పేరుతో 3.34 లక్షల పింఛన్లను తొలగించారు. అలాగే ఆధార్ కార్డు లేదన్న కారణంగా మరో 1.63 లక్షల ఫించన్లను పక్కనపెట్టారు. ఇవికాకుండా.. సామాజిక పింఛన్లకు ఇంకా 2.61 లక్షల మంది అర్హులు ఉన్నారని గత ప్రభుత్వం రచ్చబండ సందర్భంగా గుర్తించిన దరఖాస్తులను బుట్టదాఖలు చేసింది. తాజా కసరత్తులో గ్రామ, మండల కమిటీలకు 5.60 లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ పేరుతో ఈ దరఖాస్తులను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. (వీరిలో 2.40 లక్షల మంది దరఖాస్తుల కంప్యూటరీకరణ కూడా పూర్తయింది.) కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్లు ఇవ్వాలా? వద్దా? అన్నది తేల్చలేదు.  పెరిగిన పింఛన్లు వస్తాయని చూస్తున్న దాదాపు 13 లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

సర్కారు సాయంతో ఇల్లు కట్టుకునాన పింఛన్ కట్...

2007లో ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా భవనాలు నిర్మించుకున్న వారిని సైతం జాబితా నుంచి అనర్హులుగా ప్రకటించారు. తామేమీ సొంతంగా గూడు నిర్మించుకోలేదని ప్రభుత్వ సహాయంతో నిర్మించిన గృహాలను సైతం ఓ కారణంగా చూపి పింఛన్లు రద్దు చేయడమేమిటని గ్రామసభల్లో ప్రశ్నించినా పట్టించుకోలేదు. నెలకు ఠంఛన్‌గా వస్తున్న రూ. 200 పింఛన్ సైతం రద్దు చేయడంతో వృద్ధాప్యంలో ఆసరా లేకుండా చేశారని పండుటాకులు నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు.

కొత్త దరఖాస్తుదారులకూ పింఛన్ లేదు...

 అర్హులై ఉండి ఇన్నాళ్ళూ పెన్షన్ దక్కక బాధపడే వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందిస్తామని ప్రగల్భాలు పలికిన సర్కారు పెద్దలు.. అలా దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి కూడా గురువారం నుంచి ప్రారంభిస్తున్న పింఛన్ల జాతరలో  పింఛన్ అందివ్వకపోవడం గమనార్హం. కొత్త దరఖాస్తులపై బుధవారం అర్థరాత్రి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో కొత్తగా 49,000 దరఖాస్తులు స్వీకరించారు. 29,000 దరఖాస్తుల్ని అధికార యంత్రాంగం అప్‌లోడ్ కూడా చేశారు. కానీ వీరికి పింఛన్ అందించడంపై ఇంతవరకు ఏమీ తేల్చలేదు.

వేలిముద్రలున్నా.. ఆధార్ కార్డు లేదంటూ కోత...

 ప్రతి నెలా పింఛన్ చెల్లించేప్పుడు లబ్ధిదారుల వేలిముద్రలను సరిపోల్చిన తర్వాతే పింఛన్ చెల్లిస్తున్నారు. వృద్ధుల వేలి ముద్రలు అరిగిపోయి ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో వారికి సంబంధించిన కుటుంబంలోని మరొకరి వేలి ముద్రలను కూడా సేకరించారు. వాటితో సరిపోలిన తర్వాతే పింఛన్ ఇస్తున్నారు. ప్రతి నెలా ఫిజికల్‌గా వెరిఫికేషన్ జరుగుతున్నప్పటికీ బోగస్ పేరుతో 3.34 మందిని ఏరివేయడం ప్రశ్నార్థకంగా మారింది. వేలిముద్రలతో సరిపోల్చుతూ ఇప్పటికే ఐదారేళ్లుగా పింఛన్ పొందుతున్నప్పటికీ ఆధార్ కార్డులేదన్న కారణంగా 1.63 లక్షల పింఛన్లను పక్కనపెట్టారు.

 పింఛన్లు పొందేందుకు అర్హులెవరు?
 
కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.
మరే ఇతర పెన్షన్ పొందరాదు.
వృద్ధాప్య పెన్షన్‌కు 65 ఏళ్ల వయసు పైబడి ఉండాలి
చేనేత పెన్షన్లకు వయసు 50 ఏళ్ల పైబడి ఉండాలి. వితంతు పెన్షన్లు: వితంతువు అయి ఉండాలి. వయో పరిమితి లేదు.
వికలాంగ పెన్షన్లు: 18 ఏళ్ల పైబడి 40 శాతం, అంతకుమించి అంగవైకల్యం ఉండాలి
గీత పెన్షన్లు: కల్లు గీత కార్మికుడై 50 ఏళ్ల పైబడి ఉండాలి
గ్రామాల్లో: గ్రామ సభ తీర్మానం చేసి సిఫారసు చేసిన వ్యక్తులకు ఎంపీడీవో ద్వారా చెల్లిస్తారు.
పట్టణాల్లో: మునిసిపల్ వార్డు సభలు సిఫారసు చేసిన వ్యక్తులకు మునిసిపల్ కమిషనర్ల ద్వారా చెల్లిస్తారు.
 
వేలాడనున్న వడపోత కత్తి...

పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికి వడపోత  నిరంతరం కొనసాగించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో గత  కొన్నేళ్ళుగా పింఛన్లు తీసుకుంటున్న 43.12 లక్షల మందిలో అనర్హులుగా 4.97 లక్షల మందిని తేల్చారు. అనర్హుల జాబితాపై సెర్ప్ అధికారులు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు కుస్తీలు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఏరివేత అనంతరం 38.15 లక్షల మందే అర్హులుగా తేల్చారు. వడపోతను నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  కమిటీలు ధ్రువీకరించిన అర్హుల జాబితాను థర్డ్ పార్టీతో మరోసారి పరిశీలింపజేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఓ మంత్రి వెల్లడించారు. పింఛన్ల వడపోతపైనా సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. అర్హులై, ఆధార్ సీడింగ్ జరిగిన 37,02,936 మంది ఆధార్ నెంబర్లను వెబ్ ల్యాండింగ్‌తో సరిపోల్చాలని  గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు అందాయి.

ఈ కేటాయింపులతో  ఎలా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక భద్రత కింద బడ్జెట్‌లో రూ. 1,338 కోట్లు మాత్రమే కేటాయించారు. గత 5 నెలల కాలంలో 43.12 లక్షల మందికి పింఛన్ల కోసం ప్రతి నెలా రూ. 130 కోట్ల చొప్పున చెల్లించారు. ఆ లెక్కన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 650 కోట్లు అవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇక మిగిలిన ఏడు నెలల కాలానికి ప్రభుత్వం తేల్చిన 38.15 లక్షల మందికి (మెజారిటీ పింఛన్లు రూ. 1,000 చొప్పున, మరికొన్ని రూ. 1,500 చొప్పున) పింఛన్లు ఇవ్వాలన్నా నెలకు దాదాపు రూ. 450 కోట్ల చొప్పున మొత్తంగా రూ. 3,080 కోట్లు కావాలి. ఇప్పటికే గడిచిన ఐదు నెలల్లో చెల్లించిన మొత్తాన్ని కలిపితే కనీసంగా రూ. 3,730 కోట్లు అవసరం. బడ్జెట్‌లో రూ. 3,292 కోట్ల లోటు చూపిస్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏ విధంగా సమకూర్చుతుందన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ లెక్కన ప్రస్తుత నిధులతో మూడో నెలలో పెంచిన పింఛన్ ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement