సాక్షి ప్రతినిధి, వరంగల్: సాధారణ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతల్లో అప్పుడే హడావుడి మొదలైంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయా, వేర్వేరుగా జరుగుతాయా అనే అంశంతో సంబంధం లేకుండా నాయకులు ఊళ్ల బాటపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశం కీలకంగా ఉంటుందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత తమదేనంటూ అన్ని పార్టీల నేతలూ ప్రచారం మొదలు పెడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ‘స్థానిక’ అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది.
పునర్విభజన తర్వాత తొలిసారిగా జరిగిన గత ఎన్నికల సమయంలో రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర నియోజకవర్గాలకు వలస వెళ్లిన నాయకులకు ఇప్పుడు ‘స్థానిక’ అంశం సవాలుగా మారుతోంది. రాజకీయ ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత పార్టీ శ్రేణుల నుంచి.. స్థానికులకే సీట్లు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ... ఇలా అన్ని పార్టీల్లోనూ ఇది మొదలైంది. ఈ స్థానికత సమస్య సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాస్త తక్కువగా ఉంది.
గత ఎన్నికల్లో ఓడిపోయి.. మళ్లీ పోటీ చేయూలనుకునే వారికి, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారికి మాత్రం ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లు తెలంగాణ అంశం ఎన్నికల్లో ఇబ్బందిగా ఉండేది. ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని చెబుతున్న కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వాల కోసం పోటీ పడే నాయకులు పెరుగుతున్నారు. ఇలా ఎక్కువ మంది పోటీపడే పరిస్థితి ఉండడంతో ‘స్థానిక’ అంశం తెరపైకి వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు స్థానికత అంశం ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జి.విజయరామారావు, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు స్థానికత అంశంగా అధికార పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోత్ కవిత సొంత ఊర్లు వీరి నియోజకవర్గాల పరిధిలో లేవు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం, సొంత పార్టీల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకులు పోటీగా లేకపోవడంతో వీరికి ఇబ్బంది లేనట్టుగా కనబడుతోంది.
తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నాయకులు చాలా మంది వెళ్లిపోయారు. నాయకుల కొరత కారణంగా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీలుగా ఎక్కువ మంది స్థానికేతరులే ఉన్నారు. తెలంగాణ వ్యతిరేకతకు తోడు ఇప్పుడు స్థానికేతర అంశం.. జిల్లాలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో మరింత సమస్యగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజనతో సొంత నియోజకవర్గం వర్థన్నపేట ఎస్సీ రిజర్వురుగా మారడంతో టీడీపీ ప్రస్తుత తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫోరం కన్వీనరు ఎర్రబెల్లి దయాకర్‌రావు 2009లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు ఎర్రబెల్లి స్థానికుడు కాదనే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. వైఎస్సాఆర్‌సీపీ జిల్లా కన్వీనరు ముత్తినేని సోమేశ్వరరావు వారం క్రితం స్థానికేతర నాయకులపై చేసిన ప్రకటన ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనగామ, పరకాల నియోజకవర్గ ఇంచార్జీలకు స్థానికేతర అంశం అడ్డంకిగా మారుతోంది. జనగామ టీడీపీ ఇంచార్జీ ఎడబోయిన బస్వారెడ్డి సొంత ఊరు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హన్మకొండ మండలం సోమిడి. పరకాల టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ చల్లా ధర్మారెడ్డి సొంత ఊరు భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలో ఉంది. వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలోనే ఉన్నా వీరిద్దరూ పొరుగున ఉన్న సెగ్మెంట్లకు ఇంచార్జీలు ఉండడంతో ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థులు వీరి స్థానికేతర అంశాన్ని లేవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది.
స్థానిక వాదంతో పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల సీట్ల కేటాయింపులోనూ స్థానిక నేతలు ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. జనగామ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా స్థానికేతరుడిని నియమించడంపై అక్కడి గులాబీ శ్రేణులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ ఇంచార్జీగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. ఈయన సొంత ఊరు వర్థన్నపేట మండలం పున్నేలు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 2004లో తెలంగాణ జనతా పార్టీ తరఫున వర్థన్నపేట నియోజకవర్గంలో, 2009లో టీఆర్‌ఎస్ తరఫున రంగారెడ్డి జిల్లా ఉప్పల్‌లో పోటీ చేసి ఓడిపోయారు.
మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా దీటుగా ఉండే నాయకులను కాదని ముత్తిరెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియమించడంపై జనగామ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి పెరుగుతోంది. వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జీ ఆరూరి రమేశ్ సొంత ఊరు జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు. ఇది స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్ సెగ్మెంట్ కూడా ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీలోనే ఉంది.
వర్థన్నపేట నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్ నాయకులు లేనట్లుగా రమేశ్‌ను ఇన్‌చార్జ్‌గా పెట్టడంపై ఇక్కడి పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వర్థన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత ఎన్నికల్లోనూ స్థానికుడు కాని జి.విజయరామారావుకు టికెట్ ఇవ్వడం వల్లే మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ గెలవగలిందని టీఆర్‌ఎస్ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.
లోకల్ చంటికే.. సీటు
Published Thu, Jan 16 2014 4:18 AM | Last Updated on Sat, Aug 11 2018 4:48 PM
Advertisement