సాక్షి, కాకినాడ: కిర్లంపూడిలో మళ్లీ ఉద్రికత్త నెలకొంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ఆదివారం నుంచి రెండురోజుల కోనసీమ పర్యటనకు ముద్రగడ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకు.. కిర్లంపూడిలో బలగాలు మోహరించడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఆత్మీయ పలకరింపు పేరిట ఈ నెల 8,9 తేదీల్లో కోనసీమలో పర్యటించనున్నట్టు ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపు ఉద్యమానికి మద్దతు పలికిన పి. గన్నవరం నియోజకవర్గంలో అభిమానులను ఆత్మీయంగా పలుకరించనున్నట్టు ఆయన తెలిపారు.
అయితే, ఆయన పర్యటనను అడ్డుకునేందుకే పోలీసులు కిర్లంపూడిలో మోహరించినట్టు తెలుస్తోంది. ముద్రగడ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా.. తప్పకుండా పోలీసులు అనుమతి తీసుకోవాల్సిందే అన్న తరహాలో పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయనను జీవితాంతం గృహనిర్బంధం చేస్తారా? వ్యక్తిగత హోదాలో పర్యటించడానికి కూడా అవకాశం ఇస్తారా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఆయన వ్యక్తిగత పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో పేర్కొన్నారు. అయినా, ముద్రగడ ఇంటి నుంచి కదలకుండా ఆయన నివాసం చుట్టూ తాజాగా పోలీసులు మోహరించడం ఉద్రిక్తత రేపుతోంది. కాపు రిజర్వేషన్‌లో 'ఛలో అమరావతి' పేరిట ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను భగ్నం చేసి.. ఆయనను చాలకాలంపాటు పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment