సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు సీటు తనదే అంటూ ఢంకా బజాయించిన ఎస్వీ మోహన్‌రెడ్డికి ప్రస్తుతం టెన్షన్ మొదలయ్యింది. లోకేష్ మాటిచ్చిన తర్వాత తనకేమీ ఢోకా లేదని జబ్బలు
చరుచుకున్న ఆయనకు తీరా బీ–ఫారం ఇచ్చే సమయంలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఎస్వీ మోహన్ రెడ్డికే సీటు ఇవ్వాలంటూ అటు పత్తికొండ.. ఇటు కర్నూలులో అనుచరులు సమావేశాలు నిర్వహించారు.
పత్తికొండలో జరిగిన సమావేశంలో ఒకడుగు ముందుకేసి ఎస్వీకి సీటివ్వకపోతే.. టీడీపీకి సహకరించబోమని తేల్చిచెప్పారు. ఇక ఎస్వీ రెండు రోజుల నుంచి అమరావతిలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు కర్నూలు సీటుపై తేల్చేందుకు బుధవారం అమరావతికి రావాలంటూ ఎంపీ టీజీ వెంకటేష్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కబురు పంపినట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో సీటు ఎవరికనే విషయంలో స్పష్టత రానున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ ముగ్గురికీ సీటు ఇవ్వాల్సిందేనంటూ ఎస్వీతో పాటు మంత్రి అఖిలప్రియ, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజెప్పారు. అయితే.. అధిష్టానం మాత్రం
పెద్దగా స్పందించలేదని సమాచారం.
అమరావతిలోనే మకాం: సీటు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో ఎస్వీ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం నేరుగా అమరావతికి వెళ్లారు. అక్కడే మకాం వేసి క్లారిటీ తీసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రి లోకేష్ ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఎలా అంటూ పార్టీ నేతల వద్ద ప్రస్తావన తెస్తున్నట్టు సమాచారం. లోకేష్‌ను కూడా కలిసి సీటు విషయం తేల్చుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ స్పష్టత రాలేదని సమాచారం.
ఈ నేపథ్యంలోనే తన అనుచరుల ద్వారా అసమ్మతి గళం విన్పించారు. ఎస్వీ సతీమణి విజయ మనోహరి కర్నూలులో సమావేశాన్ని ఏర్పాటు చేయించి.. ఇందులో ఎస్వీకే సీటు ఇవ్వాలంటూ కేవలం ముస్లింలతో డిమాండ్ చేయించారు. ఇక ఎస్వీకి సీటివ్వకపోతే సహకరించేది లేదని పత్తికొండలో ఆయన అనుచరులు తేల్చిచెప్పారు.
లోకేష్ ప్రకటించిన సీటు విషయంలోనే ఇంతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందేమిటంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి లోలోపల మదనపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ మారి తప్పుచేశామా అని కూడా కుంగిపోతున్నట్టు సమాచారం. మొత్తమ్మీద మరో రెండు రోజుల్లో కర్నూలు సీటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. కర్నూలు తో పాటు కోడుమూరు, నందికొట్కూరు సీట్ల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment