SV Mohana Reddy
-
‘ఆ పని చేయమని లోకేష్‌ను కోరుతున్నా’
సాక్షి, కర్నూలు : నగరాన్ని జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలుకు న్యాయం జరిగిందని ఆయన వెల్లడించారు. దశాబ్దాల క్రితం జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సవరించారని ఆనందం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల వల్ల వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో పథకం ప్రకారం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపి బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి ఏర్పాటు చేసిన అమరావతిలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్దిపథంలో దూసుకుపోతున్న జగన్‌ను చూసి చంద్రబాబు కడుపు రగిలిపోతోందనీ, ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు మతిభ్రమించి అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చూపించాలని లోకేష్‌బాబును కోరారు. మరోవైపు సర్పంచ్‌కు కూడా అర్హత లేని జనసేన అధినేత గురించి మాట్లాడుకోవడం వృథా అని తేల్చి చెప్పారు. -
ఆ సీటు... హాట్ కేకు.. రూ.100 కోట్లతో కొన్న వైనం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లాలో కీలకమైన ఓ అసెంబ్లీ సీటు హాట్‌కేకుగా మారింది. ఏకంగా ఒక సీటు కోసం రూ.100 కోట్ల మేరకు అధికార పార్టీలో చేతులు మారినట్టు తెలుస్తోంది. మొదట్లో ఈ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేకే వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు ఓ ప్రజా ప్రతినిధి తనయుడికి కేటాయించారు. ఈ పరిణామం వెనుక భారీ తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. అధికార పార్టీలోని అగ్రనేతలతో పాటు జిల్లాలోని ఇద్దరు బలమైన నేతలకు భారీగా సొమ్ములు ముట్టినట్టు సమాచారం. ప్రధానంగా అధికార పార్టీలోని అగ్రనేత ఒకరికి చెన్నైలోని విలువైన స్థలాన్ని అందజేసినట్టు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలోని ఇద్దరు నేతలకు కూడా చెరో రూ.20 కోట్ల చొప్పున ముట్టజెప్పినట్టు చర్చ జరుగుతోంది. ఫలితంగానే మొదటి నుంచి ఒకరికి సీటు వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ.. చివరకు మరో వ్యక్తికి ఇచ్చినట్టు సమాచారం. చెన్నైలో స్థలం పొందిన నేత కాస్తా వీరికే సీటు ఇచ్చే విధంగా అధినేత వద్ద పావులు కదిపారు. ఇక జిల్లాలోని ఇద్దరు ముఖ్య నేతల్లో ఒకరు రూ.20 కోట్ల ప్యాకేజీతో ఏకంగా వారితోనే కలిసి తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు. మరో నేత కూడా రూ.20 కోట్ల ప్యాకేజీ తీసుకుని సీటు రావడానికి సహకరించినట్టు తెలుస్తోంది. జిల్లాలోని మరో నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ముగ్గురు నేతలకు మూటలు అందిన తర్వాతే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సీట్ల కేటాయింపులో ప్యాకేజీనే ప్రధానపాత్ర పోషించిందని జిల్లావాసులు అనుకుంటున్నారు. -
నమ్మితే నట్టేట ముంచారు.. లోకేష్ హామీకే దిక్కులేదు...
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీలో సీట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటికి నిన్న తన సతీమణి ఆరోగ్యం బాగోలేదని, ఎన్నికల బరి నుంచే కాకుండా ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించిన బుడ్డా రాజశేఖరరెడ్డి.. తిరిగి పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల వ్యయాన్ని భరించేందుకు ఎంపీ అభ్యర్థి మాండ్ర ముందుకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు సీటు దక్కని అభ్యర్థులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నమ్మితే నట్టేట ముంచారంటూ వాపోతున్నారు. ఏకంగా మంత్రి లోకేష్ హామీ ఇచ్చినప్పటికీ తనకు సీటు ఇవ్వకపోవడంపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడుతున్నారు. లోకేష్ హామీకే దిక్కులేకుండా పోయిందంటూ తన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలులో మంగళవారం జరిగిన చంద్రబాబు సభకు గైర్హాజయ్యారు. ఇక నంద్యాల సీటు విషయంలో తమకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని మండిపడిన ఎంపీ ఎస్పీవై రెడ్డి స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాము నామినేషన్ వేస్తున్నట్టు వెల్లడించారు. చివరి వరకు నీకే సీటు ఇప్పిస్తామని నమ్మించిన కోట్ల వర్గం కూడా తుదకు చేతులెత్తేయడంతో మణిగాంధీ వేదన చెందుతున్నారు. అందరూ కలసి తనను మోసం చేశారంటూ వాపోతున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన రామాంజినేయులు.. మణిగాంధీని కలిసి సహకరించాలని కోరినట్టు తెలిసింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇక నిన్నటివరకు కనీసం శ్రీశైలం సీటైనా దక్కుతుందని భావించిన ఏవీ సుబ్బారెడ్డికి చివరకు నిరాశే మిగిలింది. అంతేకాకుండా తాను వద్దన్న భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ప్రకటించడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సీట్ల వ్యవహారం కాక రేపుతోందనే చెప్పవచ్చు. ఏకాంతంగా భేటీ..బుడ్డా అంగీకారం తన సతీమణి ఆరోగ్యం బాగోలేనందున తాను ఎన్నికల బరితో పాటు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి సోమవారం ప్రకటించారు. చంద్రబాబు పర్యటన ముందు రోజు ఈ పరిణామం జరగడంతో అధికార పార్టీలో కలవరం మొదలయ్యింది. చిత్తుగా ఓడిపోతాననే ఆందోళనతోనే ఈవిధంగా తప్పుకోవాలని బుడ్డా భావించినట్టు తెలుస్తోంది. పార్టీ మారిన సమయంలో ఇచ్చిన మొత్తంతో పాటు ఆ తర్వాత కూడా బాగా సంపాదించినందువల్ల ఎన్నికల ఖర్చు ఇవ్వలేమని అధినేత తేల్చిచెప్పారు. దీంతో సంపాదించిన మొత్తాన్ని ఎన్నికల కోసం ఖర్చు పెట్టినా గెలిచే అవకాశం లేనందువల్ల బరి నుంచి తప్పుకోవాలని బుడ్డా భావించినట్టు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు పర్యటన సందర్భంగా కర్నూలుకు రావాలంటూ కబురు పంపడంతో మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బుడ్డాతో అరగంట పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల ఖర్చు భరిస్తానని హామీనిచ్చారు. చంద్రబాబు వద్దకు కూడా బుడ్డాను తీసుకెళ్లి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో తిరిగి బరిలో నిలిచేందుకు బుడ్డా అంగీకరించినట్టు తెలుస్తోంది. పుండు మీద కారం.. ఇప్పటికే సీటు రాక ఇబ్బంది పడుతున్న ఎస్వీ మోహన్‌రెడ్డిని సభ సాక్షిగా చంద్రబాబు మరింతగా అవమానించారు. సమర్థులకే సీట్లు ఇచ్చానని.. అందులో భాగంగా కర్నూలుకు టీజీ భరత్‌ను ఎంపిక చేశామని ప్రకటించారు. తద్వారా ఎస్వీ మోహన్‌రెడ్డిని అసమర్థుడిగా పేర్కొన్నారని ఆయన వర్గీయులు వాపోతున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీ అభ్యర్థికయ్యే ఖర్చు సుమారు రూ.100 కోట్ల మేర భరించేందుకు సిద్ధం కావడంతోనే టీజీ భరత్‌కు సీటు ఇచ్చేందుకు కోట్ల కూడా మద్దతిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇక భరత్ కూడా తనకు సీటు రావడానికి తండ్రి టీజీ వెంకటేష్ స్ట్రాటజీ పనిచేసిందని అనడంతో సభకు హాజరైన వారందరూ ముక్కున వేలేసుకున్నారు. -
టీజీ, ఎస్వీల మధ్య కుర్చీలాట.. విజయం ఎవరిది?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు టికెట్ విషయంలో అధికార పార్టీ నేతల్లో అదే ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు టికెట్ తమకే వస్తోందని.. రెండు రోజుల్లో ప్రకటించే రెండో జాబితాలో పేరు ఉంటుందని టీజీ వర్గం భావిస్తోంది. మరోవైపు తమకే టికెట్ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి అనుచరులు ఏకంగా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కార్యకర్తల సమావేశాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ నిర్వహించారు. రెండో జాబితాలో పేరు ఉంటుందని చెప్పారు. ‘మనకు ఇప్పటికే రాజ్యసభ ఉంది. అయినప్పటికీ కర్నూలు అసెంబ్లీ ఇవ్వాలని కోరాం. రెండో జాబితాలో లేకపోతే మరోసారి అందరితో సమావేశమవుతా’నని ప్రకటించారు. వాస్తవానికి మొదటి జాబితాలోనే పేరు ఉండాలని, లేకపోవడం బాధాకరమని అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రెండో జాబితాలో లేకపోతే అప్పుడు ఆలోచిద్దామన్నారు. అయితే, కేవలం ఎమ్మెల్యే సీటు కోసం రెండు, మూడు రోజులు వేచిచూడడం ఏమిటని టీజీ అనుచరులు వాపోతున్నారు. ఇంటి వద్దకే వచ్చి బీ–ఫారం ఇచ్చే పరిస్థితి నుంచి ఈ విధంగా మూడు రోజులు రాత్రి, పగలు తేడా లేకుండా వేచిచూడటం ఏమిటని అంటున్నారు. రెండో జాబితాలో పేరు లేకపోతే తాడోపేడో తేల్చుకుందామని టీజీ వద్ద అనుచరులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎస్వీ అనుచరుల్లో సంబరాలు అమరావతి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి అనుచరులు ఘన స్వాగతం పలికారు. మోహన్ రెడ్డికే సీటు ఖరారయ్యిందంటూ హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. దీంతో టీజీ వర్గంలో ఆందోళన మొదలయ్యింది. మొత్తమ్మీద ఈ నెల 18న కర్నూలులో జరగబోయే సమావేశంలో టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. -
ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారం కోసం అర్రులుచాచి టీడీపీలో చేరిన నేతలకు గట్టి షాక్ తగిలింది. నిన్నటి వరకు తనకే సీటు అని ధైర్యంగా ఉన్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి ఆ ఒక్కటీ తప్ప.. ఏం కావాలో చెప్పాలంటూ సుజనా చౌదరి నేతృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. టీజీ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చి తనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అయినప్పటికీ కమిటీ ఒప్పుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పూర్తి దిగాలుగా.. ఏమి చేయాలో అర్థం కాక అమరావతిలోనే ఇంకా మకాం వేసినట్టు తెలుస్తోంది. మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు ఆయన సతీమణికి జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్టు సమాచారం. మరోవైపు కర్నూలు సీటు టీజీ భరత్‌కే కేటాయించాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందుకు ప్రతిఫలంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థికి అయ్యే మొత్తం వ్యయాన్ని టీజీ భరించేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది. ఆదోని సీటును బుట్టాకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. మీనాక్షి నాయుడు సామాజిక వర్గమంతా వెళ్లి ఆ సామాజికవర్గానికి జిల్లాలో ఉన్న ఏకైక సీటును కచ్చితంగా ఇవ్వాలంటూ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీ బుట్టా రేణుకకు మొండిచేయి తప్పలేదని సమాచారం. ఇక గౌరు చరిత టీడీపీలో చేరడంతో మాండ్ర శివానందరెడ్డికి ఎంపీ సీటు కేటాయించే అవకాశం లేదన్న ప్రచారం ఊపందుకుంది. కేవలం నందికొట్కూరు సీటుకు అభ్యర్థిని నిర్ణయించే అధికారం మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది. పాణ్యం ఇన్చార్జ్గా ఉన్న ఏరాసు ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామనడంతో ఆయన కాస్తా చల్లబడ్డారు. ఇక నంద్యాల సీటును భూమా బ్రహ్మానందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించడంపై అటు ఏవీ సుబ్బారెడ్డి, ఇటు ఎంపీ ఎస్పీవై రెడ్డి వర్గాలు మండిపడుతున్నాయి. ఒకరికొకరు.. మొన్నటివరకు కోట్ల–కేఈ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ నడిచింది. అయితే, కోట్ల కుటుంబం టీడీపీలో చేరిన తర్వాత సీట్ల విషయంలో ఒకరికొకరు అండగా నిలిచినట్టు తెలుస్తోంది. ఆలూరులో బీసీ నినాదం వల్ల కొంప మునుగుతుందని, కావున తనకు డోన్ టికెట్ కావాలని కోట్ల సుజాతమ్మ భావించారు. దీంతో కేఈ కృష్ణమూర్తి రంగంలోకి దిగి..ఆలూరులో వీరభద్రగౌడ్‌ను ఒప్పించడంతో పాటు మాజీ ఇన్చార్జ్ వైకుంఠం ప్రసాద్, మసాల పద్మజ కూడా సహకరించేలా చేస్తానని చెప్పారు. దీంతో డోన్ సీటును కేఈ ప్రతాప్‌కే వదులుకునేందుకు కోట్ల కుటుంబం సిద్ధపడినట్టు తెలుస్తోంది. అలాగే కోడుమూరు సీటు విష్ణువర్దన్‌రెడ్డి వర్గానికి కాకుండా కోట్ల వర్గానికే ఇవ్వాలని కూడా కేఈ కృష్ణమూర్తి గొంతు కలిపినట్టు సమాచారం. ఈ పరిణామాలను గమనించిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్ని రోజులుగా సామాన్య కుటుంబాలను ఫ్యాక్షన్ కోరల్లో బలిచేసిన రెండు కుటుంబాలు తమ వద్దకు వచ్చే సరికి సర్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. -
గోడ దూకితే.. గోడు మిగిలింది!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు ఆశపడి టీడీపీలోకి వెళ్లిన నేతలకు ప్రస్తుతం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు రోజుల తరబడి ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో సదరు నేతలు అసహనానికి గురవుతున్నారు. తన టికెట్ విషయంలో మొదట్లో ధైర్యంగా ఉన్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చివరకు దక్కదన్న సంకేతాలతో నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. మరోవైపు కొడుకు టికెట్ కోసం ఎంపీ టీజీ వెంకటేష్ కూడా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ సీటు వ్యవహారం నేడు తేల్చే అవకాశముంది. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యరీత్యా ఎక్కువ సమయం వేచి ఉండలేని స్థితిలోనూ తనకు ఎంపీ టికెట్ లేదా కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరేందుకు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు సర్వే ద్వారా టికెట్లు ఇస్తామని రెడీమేడ్ సమాధానం ఇవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొదట్లో ఎంపీగానే పోటీ చేస్తానని భీష్మించుకున్న ఆమె.. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఫరవాలేదన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా సమీక్షల సందర్భంగానూ పిలుపు రాకపోవడంతో ఆమె మదనపడిపోతున్నారు. పైగా ఆదోని సీటును మీనాక్షి నాయుడికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అసలు ఊసులోనే లేకుండా పోయారు. నంద్యాల సీటు విషయంలోనూ అదే మడతపేచీ కొనసాగుతోంది. మొత్తంగా పార్టీ మారిన నేతలంతా ప్రస్తుతం తమకు జరుగుతున్న ‘మర్యాద’ను తలచుకుని లోలోపల కుంగిపోతున్నారు. అయ్యో..ఎస్పీవై! నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనకు ఎంపీ సీటు ఇస్తారన్న ఆశ ఉందని పైకి అంటున్నప్పటికీ..ఖర్చు విషయాన్ని ముందుకు పెట్టి సీటు నిరాకరిస్తున్నారని లోలోపల వాపోతున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ కావాలంటే ఖర్చుల కోసం రూ.60 కోట్లు చూపించాలని టీడీపీ పెద్దలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము అంత మొత్తాన్ని చూపించలేమనే ఉద్దేశంతోనే కావాలని ఇలా అడుగుతున్నారని ఎస్పీవై వాపోతున్నారు. సీటు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకోవడంతో ఈ విధంగా చేశారని అంటున్నారు. పార్టీ మారే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ మీ కుటుంబానికే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మదనపడిపోతున్నారు. చివరకు ఇంత వయస్సులో.. ఆరోగ్యం సహకరించనప్పటికీ గంటల తరబడి వేచిచూస్తే సర్వే ద్వారా తేల్చుతామని ప్రకటించడంతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదని తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కనీసం పిలవడం కానీ, సీటు విషయం మాట్లాడటం కానీ చేయలేదని సమాచారం. అలాగే కోడుమూరు ఇన్చార్జ్గా వ్యవహరించిన విష్ణువర్దన్‌రెడ్డిని కనీసం పలకరించే ప్రయత్నం కూడా పార్టీ నేతలెవ్వరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన నేతలంతా చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని చూసి తమను తామే తిట్టుకుంటున్నారు. కర్నూలు సీటుపై పీటముడి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మొన్నటివరకు సీటు తనదేనని బల్లగుద్ది మరీ వాదించేవారు. పార్టీ సభ్యత్వం మొదలుకుని.. పార్టీ కమిటీల వరకూ అన్నీ తమకే అప్పగించారని పేర్కొనేవారు. తమను కాదని సీటు వేరేవారికి ఎలా ఇస్తారని గాంభీర్యంగానూ ప్రకటించేవారు. అయితే.. నాలుగు రోజులుగా టీజీ భరత్‌కు సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో ఎస్వీ నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. దీంతో రోజూ గంటల తరబడి వేచిచూసి.. వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మోహన్‌రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి చంద్రబాబు అకారణంగా తప్పించిన విషయాన్ని ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు రాజకీయ కపట నాటకాన్ని తలచుకుంటూ నేతలు కుంగిపోతున్నారు. -
మాట ఇచ్చి.. సీటు తేల్చరే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు సీటు తనదే అంటూ ఢంకా బజాయించిన ఎస్వీ మోహన్‌రెడ్డికి ప్రస్తుతం టెన్షన్ మొదలయ్యింది. లోకేష్ మాటిచ్చిన తర్వాత తనకేమీ ఢోకా లేదని జబ్బలు చరుచుకున్న ఆయనకు తీరా బీ–ఫారం ఇచ్చే సమయంలో అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఎస్వీ మోహన్ రెడ్డికే సీటు ఇవ్వాలంటూ అటు పత్తికొండ.. ఇటు కర్నూలులో అనుచరులు సమావేశాలు నిర్వహించారు. పత్తికొండలో జరిగిన సమావేశంలో ఒకడుగు ముందుకేసి ఎస్వీకి సీటివ్వకపోతే.. టీడీపీకి సహకరించబోమని తేల్చిచెప్పారు. ఇక ఎస్వీ రెండు రోజుల నుంచి అమరావతిలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు కర్నూలు సీటుపై తేల్చేందుకు బుధవారం అమరావతికి రావాలంటూ ఎంపీ టీజీ వెంకటేష్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కబురు పంపినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీటు ఎవరికనే విషయంలో స్పష్టత రానున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ ముగ్గురికీ సీటు ఇవ్వాల్సిందేనంటూ ఎస్వీతో పాటు మంత్రి అఖిలప్రియ, నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడా తెలియజెప్పారు. అయితే.. అధిష్టానం మాత్రం పెద్దగా స్పందించలేదని సమాచారం. అమరావతిలోనే మకాం: సీటు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో ఎస్వీ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం నేరుగా అమరావతికి వెళ్లారు. అక్కడే మకాం వేసి క్లారిటీ తీసుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రి లోకేష్ ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఎలా అంటూ పార్టీ నేతల వద్ద ప్రస్తావన తెస్తున్నట్టు సమాచారం. లోకేష్‌ను కూడా కలిసి సీటు విషయం తేల్చుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ స్పష్టత రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే తన అనుచరుల ద్వారా అసమ్మతి గళం విన్పించారు. ఎస్వీ సతీమణి విజయ మనోహరి కర్నూలులో సమావేశాన్ని ఏర్పాటు చేయించి.. ఇందులో ఎస్వీకే సీటు ఇవ్వాలంటూ కేవలం ముస్లింలతో డిమాండ్ చేయించారు. ఇక ఎస్వీకి సీటివ్వకపోతే సహకరించేది లేదని పత్తికొండలో ఆయన అనుచరులు తేల్చిచెప్పారు. లోకేష్ ప్రకటించిన సీటు విషయంలోనే ఇంతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందేమిటంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి లోలోపల మదనపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ మారి తప్పుచేశామా అని కూడా కుంగిపోతున్నట్టు సమాచారం. మొత్తమ్మీద మరో రెండు రోజుల్లో కర్నూలు సీటు విషయంలో స్పష్టత వచ్చే అవకాశముంది. కర్నూలు తో పాటు కోడుమూరు, నందికొట్కూరు సీట్ల విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. -
‘వెన్నుపోటు’పై ఎమ్మెల్యే ఫిర్యాదు
కర్నూలు: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి వెన్నుపోటు పేరుతో ఓ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటపై ఎస్వీ మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాట తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అవమానించేవిధంగా ఉందని, ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా పాటను రూపొందించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. (టీడీపీలో గుబులు పుట్టిస్తున్న వర్మ పాట) మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన విధంగా ఈ పాటలో సృష్టించారని ఫిర్యాదులో స్పష్టం చేశారు. చంద్రబాబు కీర్తిప్రతిష్టలు దిగజార్చేవిధంగా చిత్రీకరించిన రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాల్సిందిగా కర్నూలు టూటౌన్లో మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. (ఆ పాటలో మీనింగ్ ఏంటి.. ఈ దిష్టిబొమ్మలేంటి: వర్మ) -
ఎస్వీ వర్సెస్ టీజీ భరత్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో నేరుగా తేల్చుకునేందుకు టీజీ భరత్ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. విజన్ యాత్ర పేరుతో 33 వార్డుల పర్యటనకు తెరలేపారు. వచ్చే నెల 9 లేదా 27వ తేదీన ఈ యాత్రను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు 2019 ఎన్నికల ఎజెండా కూడా ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎస్వీ, టీజీ మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఎమ్మెల్యే ఎస్వీ పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో టీజీ భరత్ కూడా వార్డు పర్యటనల ద్వారాతన అనుచరులను కట్టడి చేయడంతో పాటు బలాన్ని ప్రదర్శించేందుకు కూడా దోహదపడుతుందనేది ఆయన అభిప్రాయంగా ఉంది. వచ్చే నెలలో... వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని టీజీ భరత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. నేరుగా సీఎం చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తనను పోటీ నుంచి ఎవ్వరూ తప్పించలేరని కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, సీట్లను ప్రకటించేందుకు లోకేష్ ఎవరంటూ భరత్ తండ్రి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.. కనీసం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు కూడా పార్టీ ముందుకు రాలేదు. పత్తికొండ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వ్యతిరేకంగా తుగ్గలి నాగేంద్ర పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టిపై మండిపడటం తప్ప కేఈ ఏమీ చేయలేకపోయారు. ఇదే తరుణంలో కర్నూలు నగరంలోనూ ఎమ్మెల్యే ఎస్వీకి పోటీగా టీజీ భరత్ అదే పార్టీ కండువా కప్పుకుని పర్యటిస్తే అడ్డుచెప్పే అవకాశం లేదన్నది వీరి అభిప్రాయంగా ఉన్నట్టు తెలుస్తోంది. వార్డుల వారీగా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే వైఖరిని కూడా ఆయన ఎండగట్టే అవకాశముంది. ఇదే జరిగితే ఇరువర్గాల మధ్య పోటీ మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి. -
‘సీటు’ఫైట్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అధికార పార్టీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సీటు ఆశిస్తున్న టీజీ భరత్ పోటాపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక బూత్ కమిటీలతో టీజీ భరత్ సమావేశమవుతున్నారు. అంతేకాకుండా తనకే సీటు వస్తుందని... సీఎం చంద్రబాబు ఇంకా స్పందించలేదన్న విషయాన్ని వారికి గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తాను కర్నూలు సీటు వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం మంత్రి లోకేష్ ప్రకటించిన మాత్రాన సీటు ఖరారు చేసినట్టు కాదని ఆయన అనుచరులు కూడా బయట ప్రచారం చేయడం ప్రారంభించారు. మరోవైపు ఎమ్మెల్యే ఎస్వీ వార్డుల్లో పర్యటిస్తుండగా.... ఇటు టీజీ భరత్ ప్రతీ రోజూ సాయంత్రం నియోజకవర్గంలోని పలు బూతు కమిటీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గతంలో తన తండ్రి టీజీ వెంకటేష్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరికి సీటు వస్తుందనే విషయంపై అసలు చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వచ్చే సాధారణ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుకు పోటీ చేయడం ఖాయమని టీజీ భరత్ తేల్చిచెబుతున్నారు. అయితే, ఎలా పోటీ చేస్తామన్న విషయంపై అప్పుడే చర్చలు, ఆందోళన అవసరం లేదని కూడా పేర్కొంటున్నారు. కేవలం తన వెంట నడిచేందుకే ప్రస్తుతానికి సిద్ధం కావాలని... సీటు విషయంపై అధికార తెలుగుదేశం పార్టీలో సర్వే చేసిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారన్న అంశాన్ని విస్తృతంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండటం కర్నూలు అసెంబ్లీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పోటాపోటీగా...! ఒకవైపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వార్డు పర్యటనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు టీజీ భరత్ వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అటువైపు ఎవరెవరు నేతలు, కార్యకర్తలు ఉన్నారనే అంశాన్ని ఇరువురు నేతలు వాకబు చేస్తున్నారు. తద్వారా అవతలి నేతలు, కార్యకర్తలను ఆకర్షించేందుకు ఇరువురు పోటీపడుతున్నారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటనలో ప్రకటించినప్పటికీ... ఎన్నికల సమయం వచ్చే నాటికి కచ్చితంగా సర్వే ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేస్తారని టీజీ భరత్ పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇదే తరహాలో సీట్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఒకవేళ సీటు ఇవ్వకపోయినప్పటికీ తాను పోటీ చేసేది మాత్రం పక్కా అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బలాన్ని మరింత పెంచుకునేందుకు తనవైపు వచ్చే నేతల వివరాలను ఆయన వార్డుల వారీగా సేకరిస్తున్నారు. ఆ నేతలతో మాట్లాడి... తన వెంట నడవాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే కూడా తనకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారపార్టీలో ఇలా ఇరువురు నేతల మధ్య బలాలప్రదర్వన కొనసాగుతోంది. అయితే, కర్నూలు నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా ప్రజలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్న మైనార్టీ వర్గాల ఓటు బలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకే తమ మద్దతు అని తేల్చిచెబుతున్నారు. -
టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు : జిల్లా టీడీపీలో మళ్లీ కుర్చీ కొట్లాట రాజుకుంది. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జిల్లా నుంచి పోటీ చేస్తే 14 సీట్లు టీడీపీ సొంతం అవుతాయని అన్నారు. చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయలేని పక్షంలో సర్వే ప్రకారం గెలిచే వారికే కర్నూలు సీటు కేటాయించాలని కోరారు. కొంతకాలంగా స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్‌ల మధ్య సీటు పోరు కొనసాగుతోంది. ఇటీవల మంత్రి లోకేష్, కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల ప్రకటనతో టీజీ వర్గం ఆత్మరక్షణలో పడింది. తాజా టీజీ వ్యాఖ్యలతో మళ్లీ సీటు వివాదం తెరపైకి వచ్చింది. -
ప్యాకేజీకి మేమే ఒప్పుకున్నాం: కేఈ కృష్ణమూర్తి
కర్నూలు: ప్రత్యేక హోదాకు మించి ఇస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందనే హోదా అడుగుతున్నామన్నారు. ఈ విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ప్రధానితో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఏపీ అంటే మోదీకి చులకన అని, ఆంధ్రులను అవమానపరిచిన వారు మట్టికొట్టుకుపోతారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
దూషిస్తేనే మంత్రి టిజిపై దాడి: ఎస్వి మోహన రెడ్డి
కర్నూలు: రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి టీజీ వెంకటేష్ అక్రమకేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యమకారులను దూషించడం వల్లే మంత్రి టీజీపై దాడి చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. మంత్రి టీజీపై పరువునష్టం దావా వేస్తామని మోహన్‌రెడ్డి హెచ్చరించారు.