ప్లీజ్‌.. ఆ ఒక్కటీ అడక్కు  | Leaders Who Joined The TDP For Power Had Hit A Shock | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. ఆ ఒక్కటీ అడక్కు 

Published Fri, Mar 15 2019 7:55 AM | Last Updated on Fri, Mar 15 2019 8:13 AM

Leaders Who Joined The TDP For Power Had Hit A Shock - Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  అధికారం కోసం అర్రులుచాచి టీడీపీలో చేరిన నేతలకు గట్టి షాక్‌ తగిలింది. నిన్నటి వరకు తనకే సీటు అని ధైర్యంగా ఉన్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డికి ఆ ఒక్కటీ తప్ప.. ఏం కావాలో చెప్పాలంటూ సుజనా చౌదరి నేతృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. టీజీ కుటుంబానికి ఎమ్మెల్సీ ఇచ్చి తనకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని  ప్రతిపాదించినట్టు తెలిసింది. అయినప్పటికీ కమిటీ ఒప్పుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో పూర్తి దిగాలుగా.. ఏమి    చేయాలో అర్థం కాక అమరావతిలోనే ఇంకా మకాం వేసినట్టు తెలుస్తోంది. మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీతో పాటు ఆయన సతీమణికి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్టు సమాచారం. మరోవైపు కర్నూలు సీటు టీజీ భరత్‌కే కేటాయించాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించారు. ఇందుకు ప్రతిఫలంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థికి అయ్యే మొత్తం వ్యయాన్ని టీజీ భరించేలా ఒప్పందం కుదిరినట్టు ప్రచారం సాగుతోంది.

ఆదోని సీటును బుట్టాకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. మీనాక్షి నాయుడు సామాజిక వర్గమంతా వెళ్లి ఆ సామాజికవర్గానికి జిల్లాలో ఉన్న ఏకైక సీటును కచ్చితంగా ఇవ్వాలంటూ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీ బుట్టా రేణుకకు మొండిచేయి తప్పలేదని సమాచారం. ఇక గౌరు చరిత టీడీపీలో చేరడంతో మాండ్ర శివానందరెడ్డికి ఎంపీ సీటు  కేటాయించే అవకాశం లేదన్న ప్రచారం ఊపందుకుంది. కేవలం నందికొట్కూరు సీటుకు అభ్యర్థిని నిర్ణయించే అధికారం మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తోంది.

పాణ్యం ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏరాసు ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామనడంతో ఆయన కాస్తా చల్లబడ్డారు. ఇక నంద్యాల సీటును భూమా బ్రహ్మానందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించడంపై అటు ఏవీ సుబ్బారెడ్డి, ఇటు ఎంపీ ఎస్పీవై రెడ్డి వర్గాలు మండిపడుతున్నాయి. 

ఒకరికొకరు.. 
మొన్నటివరకు కోట్ల–కేఈ కుటుంబాల మధ్య  ఫ్యాక్షన్‌ నడిచింది. అయితే, కోట్ల కుటుంబం టీడీపీలో చేరిన తర్వాత సీట్ల విషయంలో ఒకరికొకరు అండగా నిలిచినట్టు తెలుస్తోంది. ఆలూరులో బీసీ నినాదం వల్ల కొంప మునుగుతుందని, కావున  తనకు డోన్‌ టికెట్‌ కావాలని కోట్ల సుజాతమ్మ భావించారు. దీంతో కేఈ కృష్ణమూర్తి రంగంలోకి దిగి..ఆలూరులో వీరభద్రగౌడ్‌ను ఒప్పించడంతో పాటు మాజీ ఇన్‌చార్జ్‌ వైకుంఠం ప్రసాద్, మసాల పద్మజ కూడా సహకరించేలా చేస్తానని చెప్పారు.

దీంతో డోన్‌ సీటును కేఈ ప్రతాప్‌కే వదులుకునేందుకు కోట్ల కుటుంబం సిద్ధపడినట్టు తెలుస్తోంది. అలాగే కోడుమూరు సీటు విష్ణువర్దన్‌రెడ్డి వర్గానికి కాకుండా కోట్ల వర్గానికే ఇవ్వాలని కూడా కేఈ కృష్ణమూర్తి గొంతు కలిపినట్టు సమాచారం. ఈ పరిణామాలను గమనించిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్ని రోజులుగా సామాన్య కుటుంబాలను ఫ్యాక్షన్‌ కోరల్లో బలిచేసిన రెండు కుటుంబాలు తమ వద్దకు వచ్చే సరికి సర్దుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement