
సాక్షి, నంద్యాల : నందుల కోట నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రసవత్తర పోరు నెలకొంది. వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి.. పల్లెనిద్ర–రచ్చబండ కార్యక్రమాల ద్వారా పల్లె ప్రజలకు చేరువయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా శిల్పా సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. టీడీపీ నాయకుల అవినీతి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎండగట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం అందించలేకపోయారు. భూమా అనుచరులు అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకోవడంతో టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోంది.
నంద్యాల నియోజకవర్గం 1952లో అవతరించింది. ప్రస్తుతం నంద్యాల పట్టణం, నంద్యాల, గోస్పాడు మండలాలు నియోజకవర్గం లో ఉన్నాయి. ఇప్పటి వరకు 15సార్లు నంద్యాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009లో నంద్యాల నియోజకవర్గంలో ఉన్న బండిఆత్మకూరు, మహానంది మండలాలను శ్రీశైలం నియోజకవర్గంలో కలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న గోస్పా డు మండలాన్ని నంద్యాల నియోజకవర్గానికి కలిపారు. ఇప్పటి వరకు నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ ఏ వర్గానికి రిజర్వ్ కాలేదు.
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఎన్‌ఎండీ ఫరూక్‌పై శిల్పామోహన్‌రెడ్డి 40,677ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇది నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ. 1978లో నబీ సాహెబ్‌పై బొజ్జా వెంకటరెడ్డి 1,693 ఓట్లతో గెలుపొందారు. ఇది నియోజకవర్గంలో అత్యల్ప మెజార్టీ.
పదవులు..నంద్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని, పీవీనరసింహరావు ప్రధాన మంత్రి పదవిని, పెండే కంటి వెంకటసుబ్బయ్య కేంద్ర హోం శాఖ మంత్రి పదివిని అలంకరించారు. అలాగే శిల్పామోహన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌లు మంత్రి పదవులు చేపట్టారు.