సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు టికెట్ విషయంలో అధికార పార్టీ నేతల్లో అదే ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు టికెట్ తమకే వస్తోందని.. రెండు రోజుల్లో ప్రకటించే రెండో జాబితాలో పేరు ఉంటుందని టీజీ వర్గం భావిస్తోంది. మరోవైపు తమకే టికెట్ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి అనుచరులు ఏకంగా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కార్యకర్తల సమావేశాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ నిర్వహించారు. రెండో జాబితాలో పేరు ఉంటుందని చెప్పారు.
‘మనకు ఇప్పటికే రాజ్యసభ ఉంది. అయినప్పటికీ కర్నూలు అసెంబ్లీ ఇవ్వాలని కోరాం. రెండో జాబితాలో లేకపోతే మరోసారి అందరితో సమావేశమవుతా’నని ప్రకటించారు. వాస్తవానికి మొదటి జాబితాలోనే పేరు ఉండాలని, లేకపోవడం బాధాకరమని అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రెండో జాబితాలో లేకపోతే అప్పుడు ఆలోచిద్దామన్నారు.
అయితే, కేవలం ఎమ్మెల్యే సీటు కోసం రెండు, మూడు రోజులు వేచిచూడడం ఏమిటని టీజీ అనుచరులు వాపోతున్నారు. ఇంటి వద్దకే వచ్చి బీ–ఫారం ఇచ్చే పరిస్థితి నుంచి ఈ విధంగా మూడు రోజులు రాత్రి, పగలు తేడా లేకుండా వేచిచూడటం ఏమిటని అంటున్నారు. రెండో జాబితాలో పేరు లేకపోతే తాడోపేడో తేల్చుకుందామని టీజీ వద్ద అనుచరులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఎస్వీ అనుచరుల్లో సంబరాలు
అమరావతి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి అనుచరులు ఘన స్వాగతం పలికారు. మోహన్ రెడ్డికే సీటు ఖరారయ్యిందంటూ హల్‌చల్ చేసే ప్రయత్నం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. దీంతో టీజీ వర్గంలో ఆందోళన మొదలయ్యింది. మొత్తమ్మీద ఈ నెల 18న కర్నూలులో జరగబోయే సమావేశంలో టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment