kurnool tdp leaders
-
టీజీ, ఎస్వీల మధ్య కుర్చీలాట.. విజయం ఎవరిది?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు టికెట్ విషయంలో అధికార పార్టీ నేతల్లో అదే ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు టికెట్ తమకే వస్తోందని.. రెండు రోజుల్లో ప్రకటించే రెండో జాబితాలో పేరు ఉంటుందని టీజీ వర్గం భావిస్తోంది. మరోవైపు తమకే టికెట్ అంటూ ఎస్వీ మోహన్‌రెడ్డి అనుచరులు ఏకంగా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కార్యకర్తల సమావేశాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ నిర్వహించారు. రెండో జాబితాలో పేరు ఉంటుందని చెప్పారు. ‘మనకు ఇప్పటికే రాజ్యసభ ఉంది. అయినప్పటికీ కర్నూలు అసెంబ్లీ ఇవ్వాలని కోరాం. రెండో జాబితాలో లేకపోతే మరోసారి అందరితో సమావేశమవుతా’నని ప్రకటించారు. వాస్తవానికి మొదటి జాబితాలోనే పేరు ఉండాలని, లేకపోవడం బాధాకరమని అన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రెండో జాబితాలో లేకపోతే అప్పుడు ఆలోచిద్దామన్నారు. అయితే, కేవలం ఎమ్మెల్యే సీటు కోసం రెండు, మూడు రోజులు వేచిచూడడం ఏమిటని టీజీ అనుచరులు వాపోతున్నారు. ఇంటి వద్దకే వచ్చి బీ–ఫారం ఇచ్చే పరిస్థితి నుంచి ఈ విధంగా మూడు రోజులు రాత్రి, పగలు తేడా లేకుండా వేచిచూడటం ఏమిటని అంటున్నారు. రెండో జాబితాలో పేరు లేకపోతే తాడోపేడో తేల్చుకుందామని టీజీ వద్ద అనుచరులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎస్వీ అనుచరుల్లో సంబరాలు అమరావతి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి అనుచరులు ఘన స్వాగతం పలికారు. మోహన్ రెడ్డికే సీటు ఖరారయ్యిందంటూ హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. దీంతో టీజీ వర్గంలో ఆందోళన మొదలయ్యింది. మొత్తమ్మీద ఈ నెల 18న కర్నూలులో జరగబోయే సమావేశంలో టికెట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. -
చంద్రబాబు వద్దకు నంద్యాల టీడీపీ పంచాయితీ
విజయవాడ: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ పంచాయతీ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి సోదరులు మంగళవారం చంద్రబాబుతో సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తమ వాదనలు వినిపించారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు. భూమా నాగిరెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని శిల్పా సోదరులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు భూమా నాగిరెడ్డితో పాటు శిల్పా సోదరులను చంద్రబాబు పిలిపించారు. నిన్న కూడా ఇరువర్గాలు విడివిడిగా చంద్రబాబుతో భేటీ అయిన విషయం విదితమే. -
భూమా నాగిరెడ్డి దాడులు చేయిస్తున్నారు
విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. తాము మొదటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, తమకు తగిన ప్రాధాన్యమివ్వాలని శిల్పామోహన్ రెడ్డి సోదరులు చంద్రబాబును కోరారు. సోమవారం విజయవాడ క్యాంప్ ఆఫీసులో శిల్పామోహన్ రెడ్డి సోదరులు.. భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వేర్వేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు. విభేదాలతో ఇరు వర్గాలు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇరువర్గాలను పిలిచి రాజీచేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల వాదనలు విని, కలసి పనిచేయాలని వారికి సూచించారు. -
జగ్జీవన్‌రామ్ జయంతికి టీడీపీ నేతలు దూరం!
కర్నూలు: దేశ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్‌రామ్ 108వ జయంతి వేడుకలకు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు దూరంగా ఉండటాన్ని దళిత సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అనంతపురంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే జిల్లాకు చెందిన బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి జయంతి కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. కాగా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉంటే మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులు కూడా జయంతి వేడుకలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం.