సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అధికార పార్టీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సీటు ఆశిస్తున్న టీజీ భరత్ పోటాపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక బూత్ కమిటీలతో టీజీ భరత్ సమావేశమవుతున్నారు. అంతేకాకుండా తనకే సీటు వస్తుందని... సీఎం చంద్రబాబు ఇంకా స్పందించలేదన్న విషయాన్ని వారికి గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తాను కర్నూలు సీటు వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం మంత్రి లోకేష్ ప్రకటించిన మాత్రాన సీటు ఖరారు చేసినట్టు కాదని ఆయన అనుచరులు కూడా బయట ప్రచారం చేయడం ప్రారంభించారు. మరోవైపు ఎమ్మెల్యే ఎస్వీ వార్డుల్లో పర్యటిస్తుండగా.... ఇటు టీజీ భరత్ ప్రతీ రోజూ సాయంత్రం నియోజకవర్గంలోని పలు బూతు కమిటీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా గతంలో తన తండ్రి టీజీ వెంకటేష్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరికి సీటు వస్తుందనే విషయంపై అసలు చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వచ్చే సాధారణ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుకు పోటీ చేయడం ఖాయమని టీజీ భరత్ తేల్చిచెబుతున్నారు. అయితే, ఎలా పోటీ చేస్తామన్న విషయంపై అప్పుడే చర్చలు, ఆందోళన అవసరం లేదని కూడా పేర్కొంటున్నారు. కేవలం తన వెంట నడిచేందుకే ప్రస్తుతానికి సిద్ధం కావాలని... సీటు విషయంపై అధికార తెలుగుదేశం పార్టీలో సర్వే చేసిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారన్న అంశాన్ని విస్తృతంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండటం కర్నూలు అసెంబ్లీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.
పోటాపోటీగా...!
ఒకవైపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వార్డు పర్యటనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు టీజీ భరత్ వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అటువైపు ఎవరెవరు నేతలు, కార్యకర్తలు ఉన్నారనే అంశాన్ని ఇరువురు నేతలు వాకబు చేస్తున్నారు. తద్వారా అవతలి నేతలు, కార్యకర్తలను ఆకర్షించేందుకు ఇరువురు పోటీపడుతున్నారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటనలో ప్రకటించినప్పటికీ... ఎన్నికల సమయం వచ్చే నాటికి కచ్చితంగా సర్వే ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేస్తారని టీజీ భరత్ పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇదే తరహాలో సీట్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఒకవేళ సీటు ఇవ్వకపోయినప్పటికీ తాను పోటీ చేసేది మాత్రం పక్కా అని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బలాన్ని మరింత పెంచుకునేందుకు తనవైపు వచ్చే నేతల వివరాలను ఆయన వార్డుల వారీగా సేకరిస్తున్నారు. ఆ నేతలతో మాట్లాడి... తన వెంట నడవాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే కూడా తనకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారపార్టీలో ఇలా ఇరువురు నేతల మధ్య బలాలప్రదర్వన కొనసాగుతోంది. అయితే, కర్నూలు నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా ప్రజలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్న మైనార్టీ వర్గాల ఓటు బలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకే తమ మద్దతు అని తేల్చిచెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment