బుట్టా రేణుక, ఎస్వీ మోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మణిగాంధీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. తర్వాత అధికార పార్టీ ప్రలోభాలకు ఆశపడి టీడీపీలోకి వెళ్లిన నేతలకు ప్రస్తుతం ఆ పార్టీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయంతో చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు రోజుల తరబడి ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో సదరు నేతలు అసహనానికి గురవుతున్నారు. తన టికెట్ విషయంలో మొదట్లో ధైర్యంగా ఉన్న కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చివరకు దక్కదన్న సంకేతాలతో నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు.
అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. మరోవైపు కొడుకు టికెట్ కోసం ఎంపీ టీజీ వెంకటేష్ కూడా రెండు రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ సీటు వ్యవహారం నేడు తేల్చే అవకాశముంది. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్యరీత్యా ఎక్కువ సమయం వేచి ఉండలేని స్థితిలోనూ తనకు ఎంపీ టికెట్ లేదా కూతురుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరేందుకు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు సర్వే ద్వారా టికెట్లు ఇస్తామని రెడీమేడ్ సమాధానం ఇవ్వడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొదట్లో ఎంపీగానే పోటీ చేస్తానని భీష్మించుకున్న ఆమె.. చివరకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఫరవాలేదన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం జిల్లా సమీక్షల సందర్భంగానూ పిలుపు రాకపోవడంతో ఆమె మదనపడిపోతున్నారు. పైగా ఆదోని సీటును మీనాక్షి నాయుడికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అసలు ఊసులోనే లేకుండా పోయారు. నంద్యాల సీటు విషయంలోనూ అదే మడతపేచీ కొనసాగుతోంది. మొత్తంగా పార్టీ మారిన నేతలంతా ప్రస్తుతం తమకు జరుగుతున్న ‘మర్యాద’ను తలచుకుని లోలోపల కుంగిపోతున్నారు.
అయ్యో..ఎస్పీవై!
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనకు ఎంపీ సీటు ఇస్తారన్న ఆశ ఉందని పైకి అంటున్నప్పటికీ..ఖర్చు విషయాన్ని ముందుకు పెట్టి సీటు నిరాకరిస్తున్నారని లోలోపల వాపోతున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ కావాలంటే ఖర్చుల కోసం రూ.60 కోట్లు చూపించాలని టీడీపీ పెద్దలు స్పష్టం చేశారు.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాము అంత మొత్తాన్ని చూపించలేమనే ఉద్దేశంతోనే కావాలని ఇలా అడుగుతున్నారని ఎస్పీవై వాపోతున్నారు. సీటు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకోవడంతో ఈ విధంగా చేశారని అంటున్నారు. పార్టీ మారే సమయంలో వచ్చే ఎన్నికల్లోనూ మీ కుటుంబానికే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మదనపడిపోతున్నారు. చివరకు ఇంత వయస్సులో.. ఆరోగ్యం సహకరించనప్పటికీ గంటల తరబడి వేచిచూస్తే సర్వే ద్వారా తేల్చుతామని ప్రకటించడంతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదని తెలుస్తోంది.
ఇక కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని కనీసం పిలవడం కానీ, సీటు విషయం మాట్లాడటం కానీ చేయలేదని సమాచారం. అలాగే కోడుమూరు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన విష్ణువర్దన్‌రెడ్డిని కనీసం పలకరించే ప్రయత్నం కూడా పార్టీ నేతలెవ్వరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ మారిన నేతలంతా చంద్రబాబు మార్క్ రాజకీయాన్ని చూసి తమను తామే తిట్టుకుంటున్నారు.
కర్నూలు సీటుపై పీటముడి
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మొన్నటివరకు సీటు తనదేనని బల్లగుద్ది మరీ వాదించేవారు. పార్టీ సభ్యత్వం మొదలుకుని.. పార్టీ కమిటీల వరకూ అన్నీ తమకే అప్పగించారని పేర్కొనేవారు. తమను కాదని సీటు వేరేవారికి ఎలా ఇస్తారని గాంభీర్యంగానూ ప్రకటించేవారు. అయితే.. నాలుగు రోజులుగా టీజీ భరత్‌కు సీటిచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
దీంతో ఎస్వీ నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేశారు. అయినప్పటికీ చంద్రబాబు దర్శనం లభించలేదు. దీంతో రోజూ గంటల తరబడి వేచిచూసి.. వెనక్కి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మోహన్‌రెడ్డి తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డిని మంత్రి పదవి నుంచి చంద్రబాబు అకారణంగా తప్పించిన విషయాన్ని ఇప్పుడు ఆయన అనుచరులు గుర్తుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా చంద్రబాబు రాజకీయ కపట నాటకాన్ని తలచుకుంటూ నేతలు కుంగిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment