
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘పసుపు కుంకుమ’ పథకం పేరుతో మహిళలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మహిళలను మభ్యపెట్టేందుకు ఈ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు దళితులకు దక్కాల్సిన 2137.66 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. తీరా లబ్ధిదారులు వెళ్లే సరికి ఖాళీ చెక్కులను ఇచ్చి చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకున్నారు. ఈ పథకంపై సొంత పార్టీ నేతలే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మా, బుట్టా రేణుకా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.