సాక్షి, నరసాపురం : తుందుర్రు ఆక్వా మెగా ఫుడ్‌పార్కును తరలించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు, ఉద్యమ నాయకులు చేస్తున్న దీక్ష సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.బేతపూడిలో ఉద్రిక్తత నెలకొంది. మెగా ఆక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ బాధితులు నాలుగు రోజులుగా ఆమరణ దీక్షలు కొనసాగిస్తుండగా బుధవారం తెల్లవారు జామున పోలీసులు దీక్షలను భగ్నం చేశారు. అయితే దీక్షలో కూర్చున్న జొన్నలగరువు గ్రామానికి చెందిన ఆనందకుమార్ కనిపించడంలేదు. దీక్ష భగ్నం చేసే సమయంలో అందరితోపాటు అతనిని పోలీసులు అరెస్టు చేశారని గ్రామస్తులంటున్నారు. తమ వద్ద అతను కనిపించకపోవడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది. అతని కోసం గాలింపు ప్రారంభించగా గ్రామంలోనూ కనిపించలేదు. ఆనంద కుమార్ ఆచూకీ లేకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొలుత దీక్షలోని వారిని ఆస్పత్రికి తరలించకుండా పాలకొల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీక్షలోని వారితోపాటు మరికొందరు ఆందోళనకారులు మొత్తం 40మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలపై ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దీక్ష చేసిన ఎనిమిదిమందిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు వైద్యానికి నిరాకరిస్తున్నారు. కాగా, దీక్షను భగ్నం చేసే సమయంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఎవరూ వీడియో, ఫొటోలు తీయకుండా అడ్డుకుని కొందరి వద్ద సెల్‌ఫోన్లు లాక్కున్నారు.
Comments
Please login to add a commentAdd a comment