బొబ్బిలిలో ఉద్రిక్తం | Tensions in Bobbili | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో ఉద్రిక్తం

Published Fri, Jul 4 2014 1:15 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

బొబ్బిలిలో ఉద్రిక్తం - Sakshi

బొబ్బిలిలో ఉద్రిక్తం

 బొబ్బిలి : మెజార్టీ లేకపోయినా బొబ్బిలిలో టీడీపీ అనైతి కంగా మున్సిపల్ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంది. 13 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్న ఆ పార్టీ ఇతర పార్టీల కౌన్సిలర్లను ప్రలోభపెట్టడంలో విజయం సాధించింది. వైఎస్‌ఆర్ సీపీ బీ ఫారంతో గెలిచిన 15వ వార్డు కౌన్సిలరు బీసపు పార్వతి....ప్రలోభాలకు లోనై టీడీపీ అభ్యర్థి తూముల అచ్యుత వల్లికి మద్దతు తెలిపారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థికి మెజార్టీ తగ్గింది. అయితే తమ పార్టీ బీ ఫారంతో గెలిచి, టీడీపీకి పార్వతి మద్దతు ప్రకటించడంపై వైఎస్‌ఆర్ సీపీ మహిళా కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 దీంతో ఇరు వర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొని ఉద్రిక్త పర్థితులు ఏర్పడ్డాయి. బొబ్బిలి మున్సిపాలిటీల్లో 30 వార్డుల్లో 15 స్థానాలు వైఎస్‌ఆర్ సీపీ గెలుపొందడంతో చైర్మన్ ఎన్నిక నామమాత్రమేనని అనుకున్నారు. నిన్నటివరకూ వైఎస్‌ఆర్‌సీపీ శిబిరంలో ఉండే పార్వతి అనూహ్యంగా గురువారం ము న్సిపల్ కార్యాలయానికి టీడీపీ కౌన్సిలర్లతో హాజరయ్యారు. మంత్రి అశోక్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లతో కలిసి పార్వతి కూడా లోపలకు వచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ల కోసం ఏర్పాటు చేసిన స్థానాల్లో కూర్చొని టీడీపీకి మద్దతుగా చేయి ఎత్తారు.
 
 దీంతో ఆపార్టీ మహిళా కౌన్సిలర్లంతా ఆగ్రహం వ్యక్తం చేసి తీవ్రంగా దుయ్యబట్టారు. వారి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. కేంద్ర మంత్రి, అధికారులు, ఇతర కౌన్సిలర్లు అక్కడే ఉన్నా ఫలితం లేకపోయింది. వెంటనే మున్సిపల్ సిబ్బంది, పోలీసు అధికారులు రంగప్రవే శం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా కౌన్సిల్ హా లులో దాడి చేశారంటూ పార్వతి... కేంద్ర మంత్రి అశోక్‌కు ఫిర్యాదు చేయగా, తమపై దాడి చేసి పార్వతి కొట్టడమే కాకుండా కుల దూషణ చేశారంటూ 3,10, 21వ వార్డు మహిళా కౌన్సిలర్లు పర్తాపు శ్రీవాణి, కాకల గోవిందమ్మ, పార్వతిలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
 అశోక్ సమక్షంలో విలువలకు పాతర
 రాజకీయాల్లో నిత్యం విలువల గురించి మాట్లాడే అశోక్ సాక్షిగా బొబ్బిలిలో పార్టీ ఫిరాయింపులు జరిగిపోయాయి. పదవుల కోసం విలువలు పక్కన పెట్టినా పర్వాలేదనడానికి గురువారం జరిగిన సంఘటనే ఉదాహరణ. కేంద్ర మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్ గురువారం బొబ్బిలి పురపాలక సంఘంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటును వినియోగించుకునేందుకు వచ్చారు.  ఓటింగ్‌లో తాము తటస్థంగా ఉంటామని ప్రకటిం చిన కాంగ్రెస్ పార్టీ తరువాత టీడీపీకి మద్దతు పలికింది. కౌన్సిల్ హాలులోనికి అశోక్ రాకముందే సూర్య రెసిడెన్సీ దగ్గరకు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు వెళ్లి వారి సంఘీభావాన్ని తెలిపారు. ఓటింగ్ సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బీసపు పార్వతి చేయి ఎత్తి టీడీపీకి బహిరంగంగా మద్దతు పలికారు. రాజకీయాల్లో విలువలు గురించి నిత్యం మాట్లాడే అశోక్ గజపతిరాజు సమక్షంలోనే పార్టీ ఫిరాయింపులను ఆ పార్టీ నేతలు ప్రోత్సహించారు. తమకు బలం లేకపోయినా ఇతర పార్టీల నుంచి కౌన్సిలర్లను కొనుగోలుకు పెద్ద మొత్తమే చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్లను సమావేశానికి హాజరుకానివ్వకుండా చేసి వారి బలాన్ని పెంచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement