పెచ్చులూడే పైకప్పు, పరీక్ష రాస్తున్న విద్యార్థులు (ఫైల్)
అయితే రేకుల షెడ్డు... లేదా పెచ్చులూడే పైకప్పు.. ఫ్యాన్ అనే వస్తువే కనిపించని కేంద్రాలు.. బెంచీలకూ దిక్కులేని పాఠశాలలు...ఇలా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ‘పది’ పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసేశారు. ఈ ఏడాదీ పదో తరగతి విద్యార్థులువిషమ పరీక్ష ఎదుర్కోనున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్: ఓ పాఠశాలను పదో తరగతి పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేయాలంటే అందులో అన్నీ సదుపాయాలు ఉండి విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. ముఖ్యంగా ఫర్నీచర్, వెలుతురు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర ఇబ్బందులు లేని స్కూళ్లు, కళాశాలలను కేంద్రాలుగా వేయాలి. ముఖ్యంగా అధికారులు పరిశీలించి అనుకూలంగా ఉన్నట్లు ధ్రువీకరించుకన్న తర్వాతే కేంద్రాలుగా సిఫార్సు చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులు సౌకర్యమేమో తెలీదుకాని కొందరు ప్రైవేట్ స్కూళ్ల యాజమానులు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం నగరం రుద్రంపేట సమీపంలోని ఓ కేంద్రాన్ని పరిశీలిస్తే అధికారులు ఏస్థాయిలో లాలూచీ పడ్డారనేది స్పష్టమవుతోంది. ఈ కేంద్రంలో గదులన్నీ రేకులషెడ్డులే. అసలే ఎండాకాలం. వేసవి తాపానికి విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడతారో ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇదొక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.
గుణ‘పాఠం’ నేర్చుకోని వైనం
పదో తరగతి పరీక్షల నిర్వహణలో గత అనుభవాలతో అధికారులు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50,989 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు విద్యార్థులను వెక్కిరించనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అనంతపురం నగరంలోనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో బల్లలను సమకూర్చలేని పరిస్థితి. దీనికితోడు రేకుల షెడ్లు, ఇరుకిరుకు గదులున్న పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులకు ఉక్కపోత కష్టాలు తప్పేలా లేవు. మరికొన్ని కేంద్రాల్లో పిల్లలకు వెలుతురు సమస్యా వెంటాడుతోంది.
సదుపాయాలు ఉన్నా... విస్మరించారు
కొన్ని స్కూళ్లు పరీక్షల నిర్వహణకు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. అలాంటి వాటిని పక్కనపెట్టి ఏమాత్రం సదుపాయాలు లేని కేంద్రాల పట్ల అధికారులు ఆసక్తి చూపడంలో మతలబేమిటో. అన్ని శాఖల ముఖ్య అధికార యంత్రాంగం ఉండే జిల్లా కేంద్రంలోనే ఈ రకంగా ఉంటే ఇక రూరల్ ప్రాంతాల్లో కేంద్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పాఠశాలల్లో బల్లల కొరత
నగరంలో నగరపాలక ఉన్నత పాఠశాల్లో తప్ప ఫర్నీచర్ మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ అరకొరగా ఉంది. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రంలో 260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో సగానికి సరిపడే ఫర్నీచర్ కూడా లేదు. అలాగే పాతూరు నంబర్–2 స్కూల్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ కేంద్రంలో 300 మంది విద్యార్థులను కేటాయించారు. ఫర్నీచరు వందమందికి కూడా సరిపడేలా లేదు. ఇలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్ల సెంటర్లదీ ఇదే పరిస్థితి. ఫర్నీచరు అద్దెకు తెచ్చుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా అది కేంద్రాల వరకు చేరడం లేదు. అధికారుల ఆదేశాలతో ఆయా కేంద్రాల నిర్వాహకులు చేతి నుంచి పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మొత్తం 189 పరీక్షా కేంద్రాలకు గాను 96 కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఫర్నీచర్ ఉంది. 14 కేంద్రాల్లో అరకొర, 79 కేంద్రాల్లో అసలే లేదు.
సమస్యలు అధిగమిస్తాం
పదోతరగతి పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. రెవెన్యూ, పోలీసు, రవాణా, విద్యాశాఖ అధికారులంతా సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఇక నీటివసతి, ఫర్నీచర్ తదితర సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటాం. – జనార్దనాచార్యులు, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment