ప్రియమైన పాఠ్యపుస్తకం..
- భారీగా పెరిగిన టెక్స్ట్‌బుక్‌ల ధరలు
- ప్రైవేటు విద్యార్థులకు అదనపు భారం
- జిల్లాలో ఆ మొత్తం రూ.2.5 కోట్లకు పైనే..
రాయవరం, న్యూస్‌లైన్ : పిల్లలకు.. దీపావళి నాడు పొద్దు గుంకేసరికి కూడా బాణసంచా ఇంటికి రాకపోతే ఎంత వెలితిగా ఉంటుందో, బడులు తెరిచి, కొత్త తరగతిలోకి వెళ్లేసరికి కొత్త పాఠ్యపుస్తకాలు చేతికి రాకపోయినా అంతే వెలితిగా ఉంటుంది. కొత్త పుస్తకాల నుంచి వెలువడే ఓ విధమైన సుగంధం.. వారికి చదువుల తల్లి నిశ్వాసలా ఉంటుంది. వాటికి అట్టలు వేసుకోవడం, రంగురంగుల, బొమ్మల స్టిక్కర్లు అంటించి, పేర్లు రాసుకోవడం లేదా అమ్మానాన్నలతో రాయించుకోవడం అదో పండగ సందడే వారికి.
అయితే తమ పిల్లల ఈ సరదాను తీర్చడం ఈసారి తల్లిదండ్రులకు భారం కానుంది. కారణం-2014-15 విద్యా సంవత్సరం నుంచి బోధించనున్న కొత్త పాఠ్యపుస్తకాల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడమే. పాఠ్యపుస్తకాల ధరలు గతేడాదితో పోల్చితే 80 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల సెట్ ధరల పెరుగుదల రూ.48 నుంచి రూ.242 వరకు ఉంది. ప్రభుత్వం మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగానే పాఠ్యపుస్తకాలను అందిస్తుంది.
ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలను విధిగా బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే.పదో తరగతి సిలబస్ ఈ ఏడాది నుంచి పూర్తిగా మారిపోయింది. కొత్త సిలబస్‌లో పాఠ్యపుస్తకాలు ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. వీటి ధర గతేడాది కంటే రూ.242 అధికంగా ఉంది. ఇప్పటికే తొమ్మిదో తరగతి వరకూ అమల్లో ఉన్న సీసీఈ విధానంలో కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించారు.
జిల్లాలో 8.12 లక్షల మంది విద్యార్థులు
జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 4.46 లక్షల మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 3.66 లక్షల మంది విద్యార్థులు చదవనున్నట్టు అంచనా. పాఠ్య పుస్తకాల ధరలు పెరగడంతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లితండ్రులపై సుమారు రూ.2.5 కోట్ల అదనపు భారం పడనున్నట్టు అంచనా.
జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు జూన్ మొదటి వారంలో పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ఆ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాల కోసం పుస్తక విక్రయ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చిన వారు వచ్చిన పుస్తకాలను తెచ్చుకునే పనిలో పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో పుస్తకాలు బుక్‌షాపులకు చేరుకోలేదని, జూన్ మొదటి వారానికి గానీ వచ్చే అవకాశం లేదని పలువురు పాఠశాల యజమానులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కాగా పెంచిన పాఠ్యపుస్తకాల ధరలను తగ్గించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.