New textbooks
-
2023–24 నుంచి కొత్త పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానం–2020లో పేర్కొన్న మేరకు విద్యావ్యవస్థలో చేపడుతున్న మార్పుల్లో భాగంగా నూతన పాఠ్యపుస్తకాలను కొత్త కరిక్యులమ్ ప్రకారం అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్ణయించింది. ఇప్పటికే కరిక్యులమ్‌లో మార్పులు చేర్పులకు సంబంధించి నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఎన్సీఈఆర్టీ ఏర్పాటుచేసింది. దీని ఆధారంగా కొత్త పాఠ్యపుస్తకాలను 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే 25 థీమ్‌లతో కూడిన పొజిషన్ పేపర్లను రూపొందిస్తోంది. జిల్లాల స్థాయిలో నిపుణులతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం కొత్త కరిక్యులమ్‌తో కూడిన పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. అధ్యాయాలను తగ్గించకుండా మార్పులు ఇక హయ్యర్ సెకండరీ తరగతులకు సంబంధించి సిలబస్ భారం తగ్గించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో సబ్జెక్టు నిపుణులు, పలువురు అధ్యాపకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. హయ్యర్ సెకండరీ విద్యార్థులు 12 తరువాత ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి వివిధ జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాయవలసి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని సిలబస్‌పై నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని చెబుతున్నారు. ఆయా అధ్యాయాలను పూర్తిగా తీసివేయకుండా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందంటున్నారు. సిలబస్‌ను తగ్గించడంవల్ల విద్యార్థుల్లో ఆ మేరకు ప్రమాణాలు దెబ్బతింటాయని, కనుక ప్రమాణాలు తగ్గని విధంగా సిలబస్‌ను పెట్టాల్సిన అవసరముందని చెబుతున్నారు. విద్యార్థులు ఆయా తరగతులకు నిర్దేశించిన సామర్థ్యాలు, నైపుణ్యాలు అలవర్చుకునేందుకు వీలుగా సిలబస్ ఉండాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ఐఐటీ, ఎన్ఐటీతోపాటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు విద్యార్థులు ఇంటర్మీడియెట్ తరగతుల్లో ఇప్పుడున్న పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌కు మించి చ దువుతున్నారని గుర్తుచేస్తున్నారు. ఈ తరుణంలో హయ్యర్ సెకండరీలో సిలబస్ తగ్గింపు ప్రభావం ఆ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులపై పడుతుందని చెబుతున్నారు. హయ్యర్ సెకండరీలో సిలబస్‌ను తగ్గిస్తే ఆ మేరకు జేఈఈ, నీట్ సిలబస్‌లోనూ మార్పులు చేయవలసి ఉంటుందన్నారు. విద్యార్థులపై భారం తగ్గించేలా.. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా విద్యారంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండడంతో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో.. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రస్తుత పాఠ్యప్రణాళికలోని అంశాలవల్ల విద్యార్థులపై అధికభారం పడకుండా చర్యలు తీసుకునేందుకు ఎన్సీఈఆర్టీ చర్యలు చేపట్టింది. కోవిడ్ సమయంలో కొన్ని తరగతులకు కుదించిన 30శాతం సిలబస్‌ను పునరుద్ధరిస్తూనే పలు మార్పులు చేర్పులు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటుచేసింది. కొత్త కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన నివేదికలు ఇంకా రావలసి ఉన్నందున 2022–23 విద్యాసంవత్సరానికి అధిక భారంగా ఉన్న అంశాలను తగ్గించి విద్యార్థులకు బోధన చేసేందుకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఆయా అంశాలపై నిపుణుల కమిటీ నివేదికలు అందించినందున వాటి ఆధారంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇవ్వనున్నారు. -
కొత్త పాఠ్య పుస్తకాలపై 31 నుంచి హెచ్ఎంలకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ ఈ నెల 31, వచ్చే నెల 1, 2 తేదీల్లో డివిజన్‌స్థాయిలో శిక్షణ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాల విద్యా శాఖాధికారులకు సూచించింది. పరీక్షల సంస్కరణలు, కొత్త పాఠ్య పుస్తకాలు, కమ్యూనిటీ మొబిలైజేషన్, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, నాణ్యతాప్రమాణాల పెంపుపై ఈ శిక్షణ ఇవ్వనుంది. త్వరలో ప్రైవేటు ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకూ శిక్షణ ఇవ్వనుంది. ఆ ఏర్పాట్లపై 29న టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. నేటి నుంచి టీఎస్‌యూటీఎఫ్ రెండో దశ విద్యాయాత్ర మంగళవారం (ఈ నెల 27) నుంచి 31వ తేదీ వరకు రెండో దశ విద్యాయాత్ర ఐదు రోజులపాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రవి ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రియమైన పాఠ్యపుస్తకం..
- భారీగా పెరిగిన టెక్స్ట్‌బుక్‌ల ధరలు - ప్రైవేటు విద్యార్థులకు అదనపు భారం - జిల్లాలో ఆ మొత్తం రూ.2.5 కోట్లకు పైనే.. రాయవరం, న్యూస్‌లైన్ : పిల్లలకు.. దీపావళి నాడు పొద్దు గుంకేసరికి కూడా బాణసంచా ఇంటికి రాకపోతే ఎంత వెలితిగా ఉంటుందో, బడులు తెరిచి, కొత్త తరగతిలోకి వెళ్లేసరికి కొత్త పాఠ్యపుస్తకాలు చేతికి రాకపోయినా అంతే వెలితిగా ఉంటుంది. కొత్త పుస్తకాల నుంచి వెలువడే ఓ విధమైన సుగంధం.. వారికి చదువుల తల్లి నిశ్వాసలా ఉంటుంది. వాటికి అట్టలు వేసుకోవడం, రంగురంగుల, బొమ్మల స్టిక్కర్లు అంటించి, పేర్లు రాసుకోవడం లేదా అమ్మానాన్నలతో రాయించుకోవడం అదో పండగ సందడే వారికి. అయితే తమ పిల్లల ఈ సరదాను తీర్చడం ఈసారి తల్లిదండ్రులకు భారం కానుంది. కారణం-2014-15 విద్యా సంవత్సరం నుంచి బోధించనున్న కొత్త పాఠ్యపుస్తకాల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడమే. పాఠ్యపుస్తకాల ధరలు గతేడాదితో పోల్చితే 80 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల సెట్ ధరల పెరుగుదల రూ.48 నుంచి రూ.242 వరకు ఉంది. ప్రభుత్వం మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగానే పాఠ్యపుస్తకాలను అందిస్తుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలను విధిగా బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే.పదో తరగతి సిలబస్ ఈ ఏడాది నుంచి పూర్తిగా మారిపోయింది. కొత్త సిలబస్‌లో పాఠ్యపుస్తకాలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయ్యాయి. వీటి ధర గతేడాది కంటే రూ.242 అధికంగా ఉంది. ఇప్పటికే తొమ్మిదో తరగతి వరకూ అమల్లో ఉన్న సీసీఈ విధానంలో కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించారు. జిల్లాలో 8.12 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 4.46 లక్షల మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 3.66 లక్షల మంది విద్యార్థులు చదవనున్నట్టు అంచనా. పాఠ్య పుస్తకాల ధరలు పెరగడంతో ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లితండ్రులపై సుమారు రూ.2.5 కోట్ల అదనపు భారం పడనున్నట్టు అంచనా. జిల్లాలో అనేక ప్రైవేటు పాఠశాలలు జూన్ మొదటి వారంలో పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ఆ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాల కోసం పుస్తక విక్రయ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఇండెంట్లు ఇచ్చిన వారు వచ్చిన పుస్తకాలను తెచ్చుకునే పనిలో పడ్డారు. అయితే పూర్తి స్థాయిలో పుస్తకాలు బుక్‌షాపులకు చేరుకోలేదని, జూన్ మొదటి వారానికి గానీ వచ్చే అవకాశం లేదని పలువురు పాఠశాల యజమానులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కాగా పెంచిన పాఠ్యపుస్తకాల ధరలను తగ్గించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.