అమలుకు నోచుకోని మూడు ప్రాజెక్టులు
చేనేత కార్మికులకు ఉపాధి హామీ మాటల్లోనే...
పాలకుల నిర్లక్ష్యమే కారణం
చీరాల, న్యూస్‌లైన్ :
వ్యవసాయం తర్వాత అతిపెద్దదైన చేనేత రంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేస్తామన్న చేనేత ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తికాలేదు. ఫలితంగా మాస్టర్ వీవర్ల దయాదాక్షిణ్యాలపైనే వారు బతకాల్సి వస్తోంది. ఏళ్లక్రితం మంజూరైన ప్రాజెక్టులు కూడా పూర్తికాలేదు.
శంకుస్థాపనకే పరిమితమైన చేనేత పార్కు:
చీరాల ప్రాంతంలో అధికంగా ఉన్న చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవితాలను మెరుగుపరిచేందుకు వేటపాలెం మండలం నాయినిపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య 2005లో వేటపాలెం మండలం నాయినపల్లి వద్ద రూ. 7.8 కోట్లతో చేనేత పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయినపల్లిలో 50 ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. లబ్ధిదారులుగా 140 మంది వరకు డిపాజిట్లు చెల్లించారు. కానీ పార్కు నిర్మించేందుకు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపారు.
స్వలాభం కోసం
మాస్టర్ వీవర్లు పార్కు నిర్మాణానికి సహకరించడం లేదు. పార్కులో కార్మికులను భాగస్వాములను చేస్తే ఎప్పటికైనా అది విజయవంతం అవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వ నిధులతో పార్కు నిర్మించి, అందులో మాస్టర్ వీవర్లకు, కొంత కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించేందుకు నిర్ణయించారు. పార్కులో మగ్గాలు, డైయింగ్ యూనిట్లు, ప్యాకింగ్ యూనిట్‌తో పాటు చేనేత అనుబంధ పనులన్నీ అక్కడే జరగేలా ప్రణాళిక రూపొందించారు. తయారీ అయిన వస్త్రాలను ఎగుమతి చేసేందుకు కూడా కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుని తద్వారా మార్కెట్ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు కూడా జరిగాయి. 500 నుంచి వెయ్యి మంది కార్మికులకు పార్కులో పని కల్పించి వారికి పార్కు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో ఉచితంగా పక్కా గృహాలు నిర్మించేందుకు నిర్ణయించారు. అయితే అంచనాలు మార్చారు. గతంలో రూ. 7.8 కోట్ల అంచనాలుండగా దాన్ని రూ. 3 కోట్లకు కుదించారు. దీంతో పార్కు నిర్మాణం కలగానే మిగిలింది.
నిరుపయోగంగా చేనేత క్లస్టర్:
చీరాల రూరల్ మండలంలోని ఈపూరుపాలెం, తోటవారిపాలెం ప్రాంతాల్లోని చేనేతలను ఆదుకునేందుకు 2006లో రూ. 2 కోట్లతో క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో నూతన డిజైన్లు, రంగు అద్దకాలపై అవగాహన పేరుతో లక్ష రూపాయలు ఖర్చు చేయగా, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో తయారవుతున్న దుస్తులపై అవగాహన కల్పించేందుకు కొందరు చేనేత కార్మికులను యాత్రల పేరుతో తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపారు. వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకున్నా రూ. 5 లక్షలు ఖర్చయ్యాయి. ఈ వ్యవహారంలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత తోటవారిపాలెంలో రూ. 70 లక్షలతో చేనేత సముదాయాన్ని నిర్మించారు. కొన్ని భవనాలు ఏర్పాటు చేసి అందులో నూతన డిజైన్లు నేర్చుకునేందుకు మగ్గాలు ఏర్పాటు చేశారు. షోరూం ఏర్పాటు చేసి చేనేతలు తయారు చేసిన వస్త్రాలు నేరుగా అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. యారన్ డిపో కూడా ఏర్పాటు చేశారు. మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అయినా అందులో శిక్షణ ఇచ్చేవారిని ఏర్పాటు చేయలేదు. కార్మికులకు ఎటువంటి శిక్షణలు, సదస్సులు నిర్వహించకపోవడంతో దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని కార్మికులు ఆ వైపు ముఖం కూడా చూడటం లేదు. కొనుగోలుదారులెవరూ క్లస్టర్లకు రావడం లేదు. ఒక్క ఎగ్జిబిషన్ కూడా జరగలేదు. ఈ వ్యవహారం మొత్తంలో రూ. 2 కోట్లు వృథా తప్ప కార్మికులకు కనీస ప్రయోజనం లేకుండా పోయింది.
మెగాటెక్స్‌టైల్ పార్కు ఊసేదీ...
చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి రక్షించేందుకు చీరాల, బాపట్ల మధ్య మెగా టెక్స్‌టైల్ పార్కు మంజూరు చేయిస్తానని బాపట్ల ఎంపీ, అప్పటి చేనేత, జౌళిశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు రూ. 70 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. నేటికీ పార్కుకు సంబంధించిన ఎలాంటి ప్రయత్నాలు మొదలుకాలేదు. కనీసం భూసేకరణ ప్రయత్నాలు కూడా జరగలేదు. అసలు పార్కు ఎక్కడ కడతారో, చేనేతలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో కూడా స్పష్టత లేదు. గతంలో ఇందిరమ్మబాట సందర్భంగా చీరాలకు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరినా ఆయన స్పందించలేదు. ఇదిలా ఉంటే రూ. 70 కోట్లతో నిర్మించే టెక్స్‌టైల్ పార్కుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని జిల్లా చేనేత శాఖాధికారులకు కేంద్రం నుంచి ఎలాంటి సూచనలు కానీ, ఆదేశాలు కానీ అందలేదు. చేనేతలు అధికంగా ఉండే చీరాల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పనబాక లక్ష్మికి గత ఎన్నికల్లో చేనేతలు అండగా నిలిచి మంచి మెజార్టీ ఇచ్చారు. కానీ తమ సంక్షేమంపై ఆమె కనీస శ్రద్ధ చూపడం లేదని చేనేతలు ఆగ్రహంతో ఉన్నారు.
చేనే‘తల రాత’ మారేనా..!
Published Tue, Jan 28 2014 3:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement