టీజీ, ఏరాసు దారెటు....?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల భవిష్యత్తు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర విభజన బిల్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకే భాష.. ఒకే రాష్ట్రంగా కలసిమెలసి జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఏ ఒక్కరూ సాహసించని పరిస్థితి నెలకొంది.
చాలా మంది పార్టీ నుంచి జారుకునేందుకు సరైన ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం తెలిసిందే. ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపగా.. నాయకత్వ లోపం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇదే సమయంలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముందు అధికార, ప్రతిపక్ష పార్టీలు కనీస పోటీని ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉదృతమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతోంది.
ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తుండగా.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్‌లు తమ భవిష్యత్‌పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఉద్యమానికి కనీస మద్దతివ్వని వీరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య ద్రోహుల విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మొదటి నుంచి కలిసి నడుస్తున్న టీడీపీతో దోస్తీ చేసేందుకు వీరు పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.
అధికార పార్టీ తీరుతో తాము కాంగ్రెస్ నాయకులమని చెప్పుకునేందుకు కూడా సిగ్గేస్తోందని వీరు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం అందుకు బలం చేకూరుస్తోంది. టీజీ కర్నూలు నుంచి, ఏరాసు పాణ్యం నుంచి పోటీ చేసే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికకు ముహూర్తం సిద్ధం చేసుకున్నా.. పార్లమెంట్‌లో విభజన బిల్లు ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని వీరు వేచి చూసే ధోరణితో ఉన్నట్లు సమాచారం. విభజనకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా లేఖ ఇచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారో లేదోననే సందిగ్ధం వారిని వెంటాడుతోంది.
బీజేపీతో జతకడితే...
టీడీపీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతం ఆ పార్టీలో చేరాలనుకునే నాయకులను సంశయంలోకి నెట్టుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు బీజేపీతో దోస్తీ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లోనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. టీడీపీ తరఫున పోటీ చేసినా బీజేపీ ప్రభావంతో ముస్లిం మైనార్టీ ఓట్లను కోల్పోవాల్సి వస్తుందేమోననే టీజీ, ఏరాసులు ఆలోచిస్తున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
కర్నూలు, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకమైన తరుణంలో టీడీపీ తరఫున బరిలో నిలిచినా బీజేపీతో ఆ పార్టీ దోస్తీ మొదటికే మోసం తీసుకొస్తుందేమోనని వీరు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఇక టీడీపీని కాదనుకుంటే.. ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడితే అటువైపు అడుగులేద్దామనే ఆలోచన చేస్తున్నట్లు వినికిడి.