ఆ ప్రభుత్వానికి మూర్ఖత్వం తగదు
తమిళనాడులో 92 వేల మంది తెలుగు విద్యార్థులకు అగచాట్లు
హైకోర్టు, కేంద్ర మైనార్టీ కమిషన్ ఉత్తర్వులు తుంగలోకి: యార్లగడ్డ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళనాడు ప్రభుత్వం తెలుగు విద్యార్థుల పట్ల మూర్ఖంగా వ్యవహారిస్తోందని సాహితీవేత్త, కేంద్ర హిందీ భాషా సంఘం సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం 2006లో జారీచేసిన ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని తెలుగు, మలయాళం, కన్నడం, ఉర్దూ భాషలకు చెందిన 2.75 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. తమిళనాడులో చదువుతున్న 92 వేల మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు తెలుగు మాతృభాషగా చదివిన విద్యార్థులు మార్చిలో జరిగే టెన్త్ పరీక్షలో తొలి భాషగా తమిళంలోనే పరీక్షలు రాయాలని ఉత్తర్వులు జారీ చేయడం తగదన్నారు.
ఉత్తర్వులు ధిక్కరించి: కేంద్ర మైనారిటీ క మిషన్ అక్టోబరు 2015లో మాతృభాషలో పరీక్షలు రాసే విద్యార్థుల హక్కులను భంగం కలిగించవద్దని ఉత్తర్వులు ఇచ్చినా తమిళ సర్కారు పెడచెవిన పెట్టిందన్నారు. మద్రాసు హైకోర్టు సైతం ఈ ఏడాదికి విద్యార్థుల డిక్లరేషన్‌లు తీసుకుని పరీక్షలు రాసేలా ఆదేశించిందన్నారు.
గవర్నర్ జోక్యం చేసుకోవాలి: తమిళనాడు గవర్నర్ కోణిజేటి రోశయ్య తక్షణం జోక్యం చేసుకోవాలన్నారు. రాజ్యాంగ అధిపతిగా భాషా అల్పసంఖ్యాక వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి ఆర్టికల్ 50 ప్రకారం రక్షణ కల్పించాలని కోరారు. తెలుగు, అల్పసంఖ్యాక విద్యార్థుల హక్కులను కాపాడాలన్నారు.