- స్పెషల్ డ్రైవ్‌లకు స్పందన కరువు
- విద్యార్థుల్లేక మూతపడుతున్న హాస్టళ్లు
‘‘నందిగామలో ఒకే సముదాయంలో నాలుగు ప్రభుత్వ వసతి గృహాలున్నాయి. రెండు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ హాస్టల్‌లో విద్యార్థులు చదువుతున్నారు. రెండేళ్ల క్రితం ఈ హాస్టళ్లలో 580మంది విద్యార్థులుండేవారు. అయితే ఈ ఏడాది ఒక్కసారిగా సగానికి సగం పడిపోయి కేవలం 241మందికి చేరింది. దాదాపు ఇదే పరిస్థితి జిల్లా అంతటా నెలకొంది.’’
విజయవాడ : ప్రభుత్వ వసతి గృహాల్లో రానురాను కనీస సౌకర్యాలు దూరమవుతుండడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఇవి వెలవెల పోతుండడంతో మేల్కొన్న అధికారులు విద్యార్థులు హాస్టళ్లలో చేరాలని నెలరోజులుగా మొత్తుకుంటున్నా చీమంత కూడా స్పందన కానరావడంలేదు. నిబంధనల ప్రకారం వందమంది ఉండాల్సిన హాస్టల్‌లో సగం మంది కూడా ఉండటం లేదు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఎస్సీ హాస్టళ్లు 149 వున్నాయి. వీటిలో బాలురకు 87, బాలికలకు 62 ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ హాస్టళ్లలో దాదాపు 15,800 మంది విద్యార్థులు వసతి పొందాలి. గత ఏడాది 11,232 మంది, సంవత్సరం 10,713 మందికి ఈ సంఖ్య పడిపోయింది.
బీసీ-ఎస్టీ హాస్టళ్లలోనూ అదే పరిస్థితి...
కాగా బీసీ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. జిల్లాలో 63 హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 46 బాలుర హాస్టళ్లుకాగా, 17 బాలికలవి ఉన్నాయి. దాదాపు 6,300 మంది విద్యార్థులు ఉండాల్సిన ఈ హాస్టళ్లలో 4,560మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల హాస్టళ్లలోనూ విద్యార్థులు చేరడం లేదు. 20 హాస్టళ్లలో దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండగా కేవలం 1100మంది మాత్రమే ఉన్నారు. జూన్ 1వ తేదీనుంచి హాస్టల్ వార్డెన్లు, గ్రామాల్లో పర్యటించి అడ్మిషన ్లకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి హాస్టళ్లలో సీట్ల భర్తీ కోసం చేసిన ప్రయత్నాలు వృథాఅయ్యాయి. ప్రతీ గ్రామం లో ప్రజాప్రతినిధులు, వార్డెన్లు కలిసి ప్రచారం చేసినా ఫలితం శూన్యమైంది.
కారణాలివేనా?..
గ్రామీణ ప్రాంతాల హస్టళ్లలో సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చటానికి ఇష్టపడడం లేదని తెలిసింది. హాస్టల్ వార్డెన్లు, సిబ్బంది సరిగా లేకపోవ డం, మెను కూడా సరిగా లేకపోవడంతో క్రమేపి ప్రభుత్వ హాస్టళ్ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు కావడంతో విద్యార్థులను హాస్టళ్లకు పంపటం లేదు. పేదలు తమ బిడ్డలను ఇంగ్లిష్ మీడియం చదివించేందుకు సిద్ధమవుతున్నారు.
మూసివేత దిశగా హాస్టళ్లు...
ఇదిలా ఉండగా వరుసగా మూడేళ్లపాటు విద్యార్థుల సంఖ్య తగ్గితే వసతి గృహాలను మూసి వేస్తారు. గత ప్రభుత్వం 75మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న వసతి గృహాల ను మూసివేయాలనే ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటికే తక్కువగా ఉన్న హాస్టళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఈ విద్యాసంవత్సరంలోనూ విద్యార్థుల సంఖ్య పెరగకపోతే దాదాపు సగానికి సగం హాస్టళ్లు మూసివేయక తప్పదని అధికారులు భావిస్తున్నారు.