
ఇక ఆపదే
- 5 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ టికెట్లు ఖరారు!
- సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మూడు
- పది స్థానాలపై తొలగని అనిశ్చితి
- గంటా బృందం టిక్కెట్లపై సస్పెన్స్
- ఇరకాటంలో అరకు టికెట్
సాక్షి,విశాఖపట్నం: టీడీపీ నాన్చినాన్చి ఐదు అసెంబ్లీ స్థానాలకు టికెట్లను ఖరారు చేసింది. శుక్రవారం వీటిపై స్పష్టత వచ్చినా పొత్తుల సాకుతో శనివారానికి వాయిదా వేసింది. మూడుచోట్ల సిటింగ్ ఎమ్మెల్యేలకు ఖరారు చేసింది. విశాఖ తూర్పు- వెలగపూడి, చోడవరం- కేఎస్‌ఎన్ రాజు, మాడుగుల-గవిరెడ్డి రామానాయుడు పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమం- గణబాబు, నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు పేర్లు కూడా బయటకు వచ్చాయి. సిట్టింగ్‌లను ప్రకటించిన చోట అసమ్మతి స్వరం భగ్గుమంది. ఇక్కడ టికెట్లు ఆశిస్తున్న వారంతా శుక్రవారం రాత్రి నుంచి కారాలుమిరియాలు నూరుతున్నారు. తమను పార్టీ వంచించిందని ఆరోపిస్తున్నారు.
ముందుంది అసలు పండగ
జిల్లాలో మిగిలిన పది సీట్ల విషయమే పీటముడిగా తయారైంది. ఒకరి పేరు ప్రకటిస్తే మరొకరు భగ్గుమనే పరిస్థితులు కనిన్నాయి. దీంతో వివాదంగా మారిన వాటి జోలికి పోలేదని భోగట్టా.
బీజేపీతో పొత్తు తేలక అభ్యర్థులను ప్రకటించలేదని అధిష్టానం పేర్కొంటుండడంతో సస్పెన్స్ వీడక ఆశావహులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తలపట్టుకుంటున్నారు. ఇటీవల పార్టీలో చేరిన గంటా బృందమైతే ముచ్చెమటల్లో మునుగుతోంది. వీరంతా రాజధానిలో మకాం పెడుతున్నారు.
ఎలమంచి,గాజువాకల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, చింతలపూడికి టికెట్లు కష్టమని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు, ఇతర సీనియర్ నేతల నుంచి పోటీ కారణంగా ఉత్తరం నుంచి ప్రస్తుత పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు కూడా టికెట్ గగనమని తెలుస్తోంది. ఇక్కడి టికెట్‌పై గంటా బాబు వద్ద పంచాయతీ పెట్టినట్లు భోగట్టా. భీమిలిలో గంటా వర్గం నేత అవంతికి పోటీ తీవ్రంగా ఉంది. విశాఖ దక్షిణంలో వాసుపల్లికి టిక్కెట్ ఖరారని ప్రచారమైనా చివరి నిమిషంలో బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో అక్కడ పనిచేస్తోన్న వాసుపల్లితో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే ఆయన గురువారం చంద్రబాబును కలిసి అసంతృప్తి కూడా వెల్లగక్కారు.
ముగ్గురు సిటింగులకు టికెట్ కేటాయించిన బాబు అరకు విషయంలో ఇరకాటంలో పడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే సిరివేము సోమ పేరును మాత్రం ప్రకటించలేదు. ఆస్థానం బీజేపీకి ఇవ్వవచ్చనే ప్రచారం ఉంది. పెందుర్తి,పాయకరావుపేట,పాడేరు,భీమిలి,అనకాపల్లి,గాజువాక తదితర స్థానాల్లో చిక్కుముడుల కారణంగా మున్ముందు ఏప్రకటన వెలువడుతుందో తెలియక రాజధానిలోనే పాగావేశారు.