జిల్లాలో బెట్టింగ్‌ల జోరు! | The betting pace! | Sakshi
Sakshi News home page

జిల్లాలో బెట్టింగ్‌ల జోరు!

Published Thu, Sep 26 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

The betting pace!

చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: క్రికెట్ మ్యాచ్‌లపై జిల్లాలో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. చాంపియన్స్‌లీగ్ (సీఎల్ టీ-20) మ్యాచ్‌లు ఇటు బుకీలతో పాటు అటు జూదప్రియులకు సైతం కాసులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మదనపల్లె, చిత్తురు, తిరుపతి ప్రాంతాల్లో బుకీలు మకాం వేసి బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. లా డ్జీలు, గెస్ట్‌హౌస్‌లు, అటవీప్రాంతాలు, పంట పొలాల వద్ద ఉన్న ఫామ్ హౌస్‌లను బెట్టింగ్‌కేంద్రాలుగా ఎంచుకొని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. జట్టు ప్రాముఖ్యత, మ్యాచ్ స్వరూపం, బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో దిగ్గజాలను ఎంచుకొని రూ.వెయ్యి నుంచి లక్షలు, కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. అయితే బుకీ కి, హంటర్‌కు మధ్య ముఖ పరిచయం లేకుండానే బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ ద్వారానే బెట్టింగ్ లావాదేవీలు సాఫీగా జరిగిపోతున్నాయి.

 రూ.50 వేలు జమ చేస్తేనే..

 బుకీలు ఎవరికంటేవారికి బెట్టింగ్‌కు అవకాశం ఇవ్వరు. ప్రస్తుతం కొనసాగుతున్న బెట్టింగ్‌లో ఉన్న ఏజెంట్లు కానీ, నమ్మకమైన సభ్యుడు కానీ ఎవరో ఒకరు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇలా బెట్టింగ్‌కు అర్హత పొందిన వారిని ‘హంటర్’ అంటారు.బుకీ అకౌంట్‌లో రూ.50 వేలు జమచేసిన రోజు నుంచే హంటర్ బెట్టింగ్‌లో పాల్గొనవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అర్ధ గంట ముందు ఎంతమంది హంటర్లు బెట్టింగ్‌కు దిగుతారో బుకీకి ఫోన్ చేసి తెలుపుతారు. ఇంటన్నెట్‌లో హంటర్లు రూ.5 వేల నుంచి 50 లక్షల వరకు బెట్టింగ్ కాస్తారు. రూ.50 వేలు అంతకు మించి వెచ్చించేవారు డిపాజిట్లు కూడా అంతే స్థాయిలో జమ చేయాల్సి ఉంటుంది. గెలుపొందిన తరువాత బుకీ మరుసటిరోజు 10, 11 గంటల లోపు హంటర్ ఖాతాలో డబ్బు జమ చేస్తాడు. ఒకవేళ హంటర్ ఓడిపోతే వారు కూడా 11 గంటల్లోపు బ్యాంక్ ఖాతాలో ఖచ్చితంగా జమచేయాల్సిందే.

 ఒక్కోదానికి ఒక్కో రేటు

 ఫోర్, సిక్స్, హాఫ్‌సెంచరీ, సెంచరీ అంటూ బ్యాట్స్‌మెన్‌లపై, బౌలింగ్‌లో ఫలానా ఓవర్‌లో ఏ బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతారు అనే వాటిపై బెట్టింగ్‌కు డబ్బు వెచ్చిస్తారు. మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చే సత్తావున్న బ్యాట్స్‌మెన్లు, బౌలర్ల పైనా అధికమొత్తంలో బెట్టింగులకు దిగుతున్నారు. ఫలానా బ్యాట్స్‌మేన్ ఇన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు బాదతాడని ఒక్కోఫోర్, సిక్స్‌కు రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఈ చాంపియన్స్‌లీగ్‌లో హాట్ ఫేవరెట్ జట్లుగా బరిలోకి దిగిన చెన్నై, సన్‌రైజర్స్, రాజస్థాన్, ముంబై టీములపై రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు పందెంకాసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

 పల్లెలకు తాకిన బెట్టింగ్ సెగ

 బెట్టింగ్ సెగ నగరాలు, పట్టణాలతో పాటు పల్లెలకు కూడా పాకింది. పల్లెల్లో చెట్లకింద దాయాలు, పేకాట ఆడేవారందరూ క్రికెట్ బెట్టింగ్‌పై పడుతున్నారు. మొబైల్‌లో ఇంటర్నెట్, రేడియోల ద్వారా ఎప్పటికప్పుడు స్కోర్లు తెలుసుకుంటూ మోజు పెంచుకుంటున్నారు. పల్లెల్లో రూ.10 నుంచి 50, 100, 200 ఇలా రూ.1000 వరకు వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. మరి కొన్ని బ్యాచ్‌లు పలమనేరు, శ్రీకాళహస్తి, పీలేరు, పుత్తూరు మొలకలచెరువు ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఖాళీగా ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిముందు తాళం వేసి లోపల టీవీలు పెట్టుకొని బెట్టింగులు కాస్తున్నారు. ఈ తరహా బెట్టింగ్‌లో అప్పటికప్పుడే డబ్బులు వెచ్చించి, అప్పటికప్పుడే వసూలు చేస్తున్నారు.

 బెట్టింగులో పోలీసుల పాత్ర ?

 క్రి కెట్ బెట్టింగ్‌లో కొంతమంది కిందిస్థాయి పోలీసు సిబ్బంది సహకారం ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. పోలీసుల నుంచి ఏ సమస్య తలెత్తకుండా ఉండేలా బుకీలు, ఏజెంట్లు మదనపల్లె, చిత్తూరు, పీలేరు తదితర ప్రాంతాల్లో కొంతమంది చోటాలీడర్లు,  క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. భారీ మొత్తంలో బెట్టింగులు పెట్టినట్లయితే ఆ పరిసర ప్రాంతాల్లో గూఢచారులను నియమించి పోలీసుల కదలికలను గుర్తిస్తూ ఫోన్‌లో ఎప్పటికప్పుడు సమాచారం అందుకొని జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్‌ను అరికట్టాల్సి ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement