
మణికొండలో బుల్లెట్ కలకలం
కాల్పుల చప్పుడు లేదు... రైఫిల్ ఎవరిదో తెలియదు... కానీ, ఓ వ్యక్తి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. శనివారం హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓ వ్యక్తి చేతికి తీవ్ర గాయం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్: కాల్పుల చప్పుడు లేదు... రైఫిల్ ఎవరిదో తెలియదు... కానీ, ఓ వ్యక్తి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. శనివారం హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన సీహెచ్ శ్రీనివాసాచారి(41) కార్పెంటర్‌గా పనిచేస్తూ మణికొండలో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం నీళ్ల క్యాన్‌ను బైక్‌పై తీసుకెళ్తుండగా స్థానిక హనుమాన్ దేవాలయం సమీపంలో అతడి చేతిపై ఉన్నట్టుండి పెద్ద గాయమైంది. పాము కరిచిందని భావించి సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాడు. పాము కాటుతో గాయం కాలేదని డాక్టర్ నిర్ధారించడంతో శ్రీనివాసాచారి తిరిగి తనకు గాయమైన చోటుకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ బుల్లెట్ లభించడంతో రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించాడు.
ఇంతకీ ఆ బుల్లెట్ ఎక్కడిది..?
శ్రీనివాసచారి చేతికి తగిలిన బుల్లెట్ ఇన్సాస్ రైఫిల్‌కు చెందినదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రైఫిల్ ఎక్కువగా మిలటరీ జవాన్లు వాడుతుంటారు. సంఘటన స్థలానికి మిలటరీ ఫైరింగ్ రేంజ్‌కి మధ్య దూరం రెండున్నర కిలోమీటర్లు. అయితే ఇన్సాస్ రైఫిల్ నుంచి వచ్చే బుల్లెట్ సామర్థ్యం 400 మీటర్లే. అయితే ఇది మిలటరీ రేంజ్ నుంచి రాకపోవచ్చని అనుమనాలు కలుగుతున్నాయి. మరోపక్క రైఫిల్ యాంగిల్ (ఎత్తుకు) మార్చి కొడితే రెండు కిలోమీటర్ల దూరం బుల్లెట్ దూసుకెళ్తుందని మరికొందరు అధికారులు అంటున్నారు. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనికోసం బుల్లెట్‌ను ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపించినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. కాగా, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసాచారి చేతికి డాక్టర్లు ఆపరేషన్ చేసి, బుల్లెట్ ముక్కను వెలికితీశారు.