దూరం.. భారం
ఇసుక బంగారమే!
సాక్షి, కర్నూలు: ఇసుక ధర అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పగించేందుకు నిర్ణయించడం తెలిసిందే. ఫలితంగా ఇసుక చౌక ధరకు లభించే అవకాశం ఏర్పడినా.. దూర ప్రాంత ప్రజలకు రవాణా ఖర్చు తడిసి మోపెడు కానుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక వ్యాపారంలో అత్యంత చురుగ్గా వ్యవహరిస్తున్న డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు తీర్మానించారు. ఆ మేరకు ఇప్పటికే పలు సంఘాలకు బాధ్యతలు కట్టబెట్టారు.
జిల్లాలోని జి.సింగవరం-ఎదురూరు, నిడ్జూరు-బావాపురం, మంత్రాలయం పరిధిలో ఇసుక తవ్వకాలకు మూడు రీచ్‌లను ఎంపిక చేశారు. త్వరలోనే సంఘాల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా తరహాలో ఇక్కడా అదే పాలసీని అమలు చేసేందుకు జిల్లా నుంచి ఓ టీం అధ్యయనం చేసి వచ్చింది. పర్యావరణ అనుమతులు కూడా పూర్తి కావడంతో ఇక తవ్వకాలకు అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేస్తోంది.
మొత్తం 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి అనుమతి లభించింది. జి.సింగవరం-ఎదురూరు రీచ్, నిడ్జూరు-బావాపురం రీచ్‌లలో 50వేల క్యూబిక్ మీటర్లు చొప్పున.. మంత్రాలయం రీచ్‌లో 2.40 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుకునే వీలుంది. ఇసుక ధర నిర్ణయంపై కసరత్తు జరుగుతోంది. అయితే అధికార వర్గాల సమాచారం మేరకు క్యూబిక్ మీటరు ఇసుకను రూ.650లకు విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ లెక్కన యూనిట్ ఇసుక ధర రూ.2వేలు పలకనుంది.
ఒక లారీలో రెండు యూనిట్ల ఇసుక తరలిస్తే రూ.4వేలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులకు ఇదేమీ భారం కాకపోయినా.. రవాణా చార్జీ కాస్త ఇబ్బంది కానుంది. జిల్లా అధికారులు కిలోమీటరుకు రూ.65 చొప్పున ధర నిర్ణయించాలని భావిస్తున్నారు. ఆ మేరకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు రెండు యూనిట్లకు రూ.2వేలు అధనంగా భరించాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు నిడ్జూరు-బావాపురం రీచ్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అంటే ఆయా ప్రాంతాల ప్రజలు రవాణా చార్జీలే రూ.6500 పైగా భరించాల్సిన పరిస్థితి. ఈ మొత్తానికి ఇసుక ధర కలిపితే రెండు యూనిట్ల ఇసుక రవాణాకు రూ.10,500 వెచ్చించాల్సి రావడం గమనార్హం. ఇదిలాఉంటే మంత్రాలయంలో రీచ్‌ను నిర్ణయించినా ఆ ప్రాంతంలో ప్రజల తాగునీటి అవసరాలకు నిర్మించిన పథకం ఉండటంతో ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు తవ్వకాలకు అనుమతి అసాధ్యమని తెలుస్తోంది.
అదే జరిగితే ఆదోని డివిజన్‌లోని ప్రజలకూ ఇసుక బంగారం కానుంది. ప్రభుత్వ తాజా విధానం పరిశీలిస్తే.. ఇసుక అవసరమైన వినియోగదారులు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే, మహిళా సంఘాలు రవాణా చార్జీలు కలుపుకొని ఇసుక సరఫరా చేయనున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ కావడంతో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే వెలసుబాటు ఉంది.
ఇసుక రవాణాకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వీటికి ప్రభుత్వ స్టిక్కర్లు అతికిస్తామని.. భవిష్యత్‌లో జీపీఎస్‌కు అనుసంధానం చేయనుండటంతో ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా రవాణా చార్జీల విషయంలో ప్రభుత్వం పునరాలోచించకపోతే దూర ప్రాంత వినియోగదారులు ఆర్థికంగా నష్టపోవాల్సిందే.