వేలాది మంది గిరిజనుల బతుకుకు, మెతుకుకు పూచీ పడే సుదీర్ఘ గిరులు తూర్పు కనుమలు. ఎంతో విలువైన అటవీ సం పదకు ఆలవాలమైన ఈ పర్వత పంక్తులు వెలకట్టలేని సంపదకు నెలవుగా వన్నెకెక్కాయి.
- అమూల్యమైన రాళ్లతో కోట్లలో వ్యాపారం
- తవ్వకాలకు అనుమతులకై కొందరి యత్నం
- గత ప్రమాదాలు విస్మరించి డబ్బు కోసం ఆరాటం
నర్సీపట్నం రూరల్: వేలాది మంది గిరిజనుల బతుకుకు, మెతుకుకు పూచీ పడే సుదీర్ఘ గిరులు తూర్పు కనుమలు. ఎంతో విలువైన అటవీ సం పదకు ఆలవాలమైన ఈ పర్వత పంక్తులు వెలకట్టలేని సంపదకు నెలవుగా వన్నెకెక్కాయి. జిల్లాలోని తూర్పు కనుమల పరిధిలో లభించే అమూల్యమైన రంగురాళ్లు ఇప్పటికే ఎందరికో కోట్లు ఆర్జించిపెట్టాయి.
అదే సమయంలో ఎందరో అమాయకుల ప్రాణాలను తవ్వకాలు బలి తీసుకున్నాయి. ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా రంగురాళ్లపై ఆశ కొందరిని పరుగులు తీయిస్తోంది. అందుకే లీజ్ కోసం కొందరి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపున నిఘా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో అతి కీలకమైన గొలుగొండ మండలంలోని అనధికారిక క్వారీల్లో వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది.
కరక మెరుపు తునక : గొలుగొండ మండలంలోని కరక రిజర్వు ఫారెస్టులో దొరికే రంగురాళ్లు ఎంతో విలువైనవిగా వన్నెకెక్కాయి. రెండు దశాబ్దాల క్రితం గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో తొలిసారిగా రంగు రాళ్లు బయిటపడ్డాయి. ఇక్కడ కేట్స్ ఐ, అలెక్స్ రకం రంగురాళ్లు దొరికేవి. కాలక్రమేణా కరక రిజర్వు ఫారెస్టులో అత్యుత్తమమైన అలెక్స్ రంగురాళ్లు లభ్యం కావడంతో, వీటికి లక్షల్లో ధర పలకడంతో తవ్వకాలు ఊపందుకున్నాయి. కొద్ది ఏళ్లలో ఇక్కడ వందల కోట్ల లావాదేవీలు సాగి ఉంటాయంటున్నారు.
ఎడాపెడా ప్రమాదాలు : రంగురాళ్ల ద్వారా కోట్లు లభిస్తూ ఉండడంతో ఎందరో ఎగబడ్డారు. దాంతో ప్రమాదాలు భారీ ఎత్తున జరిగాయి. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో తవ్వకాలు విస్తృతంగా సాగుతున్నాయన్నది విస్పష్టం. ప్రస్తుతం కరక చుట్టుపక్కల ప్రాంతాల్లో క్వారీలు నిర్వహించేందుకు వ్యాపారులు ప్రణాళికలు చేశారు. లీజుకు దరఖాస్తు చేసిన కొంతమంది అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు భోగట్టా.