శైలూ మార్క్ | the company continues to serve as chairman of the minority leader | Sakshi
Sakshi News home page

శైలూ మార్క్

Published Fri, Dec 20 2013 3:23 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మైనార్టీ నేత రషీద్ అహ్మద్‌ను తొలగించి తన అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి ఆ పదవిని కట్టబెట్టడంలో రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ సఫలీకృతులయ్యారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మైనార్టీ నేత రషీద్ అహ్మద్‌ను తొలగించి తన అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి ఆ పదవిని కట్టబెట్టడంలో రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ సఫలీకృతులయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మూడు దశాబ్దాలుగా రషీద్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. 2005 నగర పాలక ఎన్నికల్లో ఎనిమిదో వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. నాలుగేళ్ల పాటు అనంతపురం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి నిలిచిన రషీద్ అహ్మద్‌ను 2011 జనవరి 18న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.
 
 ఆ పదవిలో రెండేళ్ల పాటు రషీద్ అహ్మద్ కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం అనంతపురం శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో అనంతపురం శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆ పార్టీ నేతలు ఏ ఒక్కరూ సాహసించలేదు. ఈ నేపథ్యంలో ముర్షీదా బేగంను అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆమె భర్త రషీద్ అహ్మద్‌పై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గిన రషీద్ అహ్మద్ తన భార్యను అనంతపురం శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీ నిలవలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థి ముర్షీదా బేగంకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రషీద్ అహ్మద్ పదవీ కాలం 2013 జనవరి 18కే పూర్తయింది.
 
 పార్టీ కోసం త్యాగాలు చేసిన తనను ఆ పదవిలో మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని ఆయన అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అయితే రషీద్ అహ్మద్ పదవీకాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవిలో తన అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని కూర్చోబెట్టాలని ప్రాథమిక విద్యాశాఖతోపాటు గ్రంథాలయాల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్న మంత్రి శైలజానాథ్ తీవ్ర స్థాయిలో సీఎంపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఆ పదవిలో బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని నియమించాలని సీఎం, గవర్నర్‌కు ప్రతిపాదించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం నియామకపు ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 1499) జారీ చేశారు. కాగా.. తనను పదవి నుంచి తొలగించడంపై రషీద్ అహ్మద్ మండిపడుతున్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి నిలిచిన తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇదే అంశంపై రషీద్ అహ్మద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయడం, ప్రజలకు సేవ చేయడం మాత్రమే తనకు తెలుసునన్నారు. కానీ.. పార్టీ కోసం పనిచేస్తోన్న నాయకులకు గుర్తింపు లేకుండా పోతోందని వాపోయారు. అడుగులకు మడుగులొత్తే వారికి.. చెంచాగిరి చేసే వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణను శుక్రవారం వెల్లడిస్తానని స్పష్టీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement