శైలజానాథ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఝలక్ ఇచ్చిన మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. రాయ‘బేరం’ కుదరడంతో శింగనమల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలన్న శైలజానాథ్ ఆశలకు ఆదిలోనే జేసీ గండికొట్టారు. శైలజానాథ్‌పై శింగనమలలో ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. అది అనంతపురం లోక్‌సభ అభ్యర్థి అయిన తనపై పడుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జేసీ వివరించారు. శింగనమలలో కాకుండా శైలజానాథ్‌ను మరోప్రాంతంలో బరిలోకి దించితే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దాంతో మడకశిర నుంచి శైలజానాథ్‌ను బరిలోకి దింపేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. దీనిపై శైలజానాథ్ ఎలా స్పందిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రి శైలజానాథ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే.. రాష్ట్ర విభజనను ఆపేయించే బాధ్యత తనదంటూ అనేక సందర్భాల్లో టీడీపీ నేతలకు శైలజానాథ్ సవాల్ విసిరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతోన్న క్రమంలోనే జై సమైక్యాంధ్ర పార్టీని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించేలా మాజీ మంత్రి శైలజానాథ్ చక్రం తిప్పారు. సీఎం కిరణ్ తనకు అత్యంత సన్నిహితుడని నమ్మి శైలజానాథ్‌కు ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. కానీ.. ఆ పార్టీకి రాజకీయ భవిత లేదని గ్రహించిన శైలజానాథ్ ఇతర పార్టీల వైపు చూశారు.
వైఎస్సార్‌సీపీలో ఖాళీ లేకపోవడంతో టీడీపీపై కన్నేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మండ్లి నరసింహారెడ్డిని జేసీ దివాకర్‌రెడ్డి వద్దకు రాయబారం పంపారు. జేసీ నుంచి సానుకూల స్పందన లభించకపోవడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుతో రాయ‘బేరం’ సాగించారు.
బేరసారాలు కుదరడంతో శింగనమల టీడీపీ టికెట్‌ను శైలజానాథ్‌కు ఖరారు చేశారు. ఇటీవల టీడీపీలో చేరే ముహూర్తాన్ని ఖరారు చేసుకోవడానికి చంద్రబాబుతో జేసీ చర్చించారు. ఆ చర్చల సమయంలోనే శైలజానాథ్‌ను శింగనమల నుంచి బరిలోకి దింపుతున్నట్లు జేసీకి చంద్రబాబు వివరించారు. ఈ ప్రతిపాదనను జేసీ తీవ్రంగా వ్యతిరేకించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. శైలజానాథ్‌పై శింగనమల నియోజకవర్గంలో తీవ్రంగా వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. అది అనంతపురం లోక్‌సభ అభ్యర్థి అయిన తన విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని జేసీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి.
శైలజానాథ్‌ను అనంతపురం లోక్‌సభ పరిధిలో కాకుండా ఎక్కడ బరిలోకి దించినా తనకు అభ్యంతరం లేదని జేసీ చెప్పినట్లు సమాచారం. దాంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఇటీవల టీడీపీలో చేరే ముహూర్తం కోసం శైలజానాథ్ సంప్రదించగా.. కొన్నాళ్లు ఆగాలని చంద్రబాబు ఆయనకు సూచించడంలో అంతరార్థం జేసీ మోకాలడ్డటమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శైలజానాథ్‌ను మడకశిర నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలను చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఈ ప్రతిపాదనకు శైలజానాథ్ ఎలా స్పందిస్తారన్న విషయాన్ని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద చర్చించినట్లు టీడీపీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఇపుడు శైలజానాథ్ వైఖరేంటన్నది హాట్ టాపిక్‌గా మారింది.