సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపగ్రహ సేవలు అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30న ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి మొట్టమొదటగా జీశాట్-7 అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
2,550 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచి అంతరిక్ష సంస్థకు చెందిన అరైన్-వీఏ215 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా పంపేందుకు సిద్ధమైంది. ఈ తరహా సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో జియోసింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఉపగ్రహ వాహకనౌకను రూపొందించింది. ఈ రాకెట్ సాంకేతిక పరిజ్ఞానంలో కాస్త వెనుకబడి ఉండటంతో అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాలను ఫ్రెంచి అంతరిక్ష సంస్థ వారి సహకారంతోనే ప్రయోగిస్తున్నారు.
ఈ నెల 19న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ డీ-5 ద్వారా జీశాట్-14ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేయగా.. చివరి గంటలో సాంకేతికలోపంతో ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో ఇప్పటి దాకా 23 సమాచార ఉపగ్రహాలను ప్రయోగించింది. 24వ ఉపగ్రహాన్ని ఈ నెల 30న ప్రయోగించనుంది. దేశరక్షణ వ్యవస్థకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించేందుకు మల్టిపుల్ బాండ్ ఆల్ట్రా హై ఫ్రీక్వెన్సీతో కూడిన ఎస్-బాండ్, సీ-బాండ్, హై క్వాలిటీ కేయూ-బాండ్ అనే సాంకేతిక పరికరాలను ఉపగ్రహంలో అమర్చిపంపుతున్నారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులో ఉన్న ఐసాక్ కేంద్రం, అహ్మదాబాద్‌లోని స్పేస్ అఫ్లికేషన్ సెంటర్ వారు రూపొందించారు.
30న జీశాట్-7 ప్రయోగం
Published Fri, Aug 23 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement