సృష్టిలో ఎన్నో వింతలు, అద్భుతాలు. అందులో కవల పిల్లలూ ఓ భాగం. ముద్దులొలికే మోముతో అచ్చు గుద్దినట్లు ఇద్దరూ ఒకే రకంగా కనిపిస్తూ పలువురు కవలలు మనల్ని తికమక పెట్టడం పరిపాటి. చాలా మంది కవలలు ఇద్దరూ ఒకేలా ఉన్నప్పటికీ, కొందరిలో పోలికలు అంతగా కనిపించవు. ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి అయితే పోలికలు మరింత తక్కువగా ఉంటాయి.
సినిమాల్లో చూపినట్లు ఇద్దరిలోనూ ఒకే లక్షణాలుండడం చాలా అరుదు. తల్లిదండ్రులకు మాత్రం వీరిని ఒకేసారి పెంచాల్సి రావడం కాస్తంత ఇబ్బందే. కవల పిల్లలు సమాజానికి చక్కటి కథా వస్తువుగా ఉపయోగపడుతున్నారు. అది రామాయణం (వాలి, సుగ్రీవుడు) మొదలు క్రికెట్ (స్టీవ్ వా, మార్క్ వా) దాకా. మొట్టమొదటి కవలల దినోత్సవం పోలెండ్‌లో 1976లో జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల కవలలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కవలల గురించి తెలియజేసే శాస్త్రాన్ని ‘జెమిలోలజీ’ అంటారు.
- న్యూస్‌లైన్, అనంతపురం కల్చరల్
ఎవరు సన్నీ.. ఎవరు బన్నీ?
వీరిద్దరిలో ఎవరు సన్నీ.. ఎవరు బన్నీ అని కనుక్కోవడం కొంచెం కష్టమే. ఇద్దరూ ఒకే పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నారు. ఆ తరగతి టీచర్లు సైతం వారిని గుర్తించడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారట. ఒకరు అల్లరి చేస్తే మరొకరికి దెబ్బలు కొట్టిన రోజులూ లేకపోలేదు. కదిరిలోని రైల్వేస్టేషన్ వీధిలో కాపురముంటున్న టీచర్ గంగాధర్‌రెడ్డి, రాణి దంపతుల కవల పిల్లలు శశిధర్‌రెడ్డి, మహిధర్‌రెడ్డి. వీరిని ముద్దుగా సన్నీ, బన్నీ అని పిలుస్తారు. ‘మొదట్లో మేము కూడా సన్నీ ఎవరో, బన్నీ ఎవరో గుర్తించడం కష్టంగా ఉండేది. ఇలాగైతే కాదని ఒకరి చేతికి నల్ల దారం, మరొకరికి ఎర్ర దారం కట్టాం. చుట్టుపక్కల వారు ఎవరు ఎవరో గుర్తుపట్టలేక సన్నీ, బన్నీ అంటూ రెండు పేర్లతో పిలుస్తుంటార’ని రాణి దంపతులు తెలిపారు. - న్యూస్‌లైన్, కదిరి
క(వ)లల పంట
Published Sat, Feb 22 2014 3:30 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement