వానమ్మా.. వెల్‌కమ్.. | The crucial South West Monsoon has finally hit Kerala | Sakshi
Sakshi News home page

వానమ్మా.. వెల్‌కమ్..

Published Sat, Jun 7 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

వానమ్మా.. వెల్‌కమ్..

వానమ్మా.. వెల్‌కమ్..

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
  మరో 4 రోజుల్లో సీమాంధ్రకు, వారంలో తెలంగాణకు వచ్చే అవకాశం 
 
 సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ/తిరువనంతపురం: దేశమంతా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు శుక్రవారం భారత ఉపఖండాన్ని తాకాయి. సాధారణ తేదీ కన్నా నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు శుక్రవారం నాడు కేరళ తీరాన్ని దాటాయి. రెండు రోజులుగా కేరళలో రెండున్నర మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది రుతుపవనాల రాకకు సంకేతమని శుక్రవారం ఈ మేరకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డెరైక్టర్ జనరల్ ఎల్.ఎస్. రాథోడ్ తెలిపారు. కేరళతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా శుక్రవారం నైరుతి విస్తరించిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఓ బులెటిన్‌లో పేర్కొంది.
 
నాలుగు రోజుల్లో సీమాంధ్రకు, తర్వాత వారంలో తెలంగాణ అంతటికీ విస్తరించే అవకాశాలున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ  కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఒకట్రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
 
కాగా, దేశంలో గత నాలుగేళ్లుగా వర్షపాతం సాధారణం, సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయింది. అయితే ఈ ఏడాది పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా భారత్‌లో సాధారణం కంటే తక్కువగా 95 శాతమే వ ర్షపాతం ఉండవచ్చని నిపుణుల అంచనా. 
 
 కొనసాగుతున్న వడగాడ్పులు: దక్షిణ కోస్తా, తెలంగాణ లో వడగాల్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.
 
శుక్రవారం గుంటూరులోని రెంటచింతలలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే రామగుండం, బాపట్లలో 44, ఒంగో లు, గన్నవరం, కావలి, నిజామాబాద్‌లలో 43, నంది గామ, నెల్లూరులో 42, హైదరాబాద్, కర్నూలులలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఉత్తరభారతాన్ని కూడా వడగాడ్పులు, విద్యుత్ కోతలు వణికిస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ, పంజాబ్, లక్నోతో సహా అనేక చోట్ల 45 నుంచి 48.4 డిగ్రీల సెల్షియస్‌ల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement