సాగు వేళ దిగులు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : మృగశిర వచ్చిందంటే ఖరీఫ్ ప్రారంభమైనట్టు లెక్క... ఆ సమయానికే అడపా, దడపా పడే వర్షపు జల్లులకు రైతన్నలు నాలుగైదు సార్లు దుక్కులు చేపట్టి నారుమళ్లు సిద్ధం చేస్తారు. కార్తె రాకతో విత్తనాలు చల్లి, వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వాస్తవంగా కార్తెల ప్రకారం రైతులు ఇలా నిర్ణీత సమయాన్ని గుర్తించి, సాగునకు సన్నద్ధం కావడం ఆనవాయితీ.
ప్రభుత్వం సైతం ముందుగానే ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసుకుని, మృగశిర సమీపించేనాటికే విత్తనాలు, వ్యవసాయ మదుపులకు రుణాలు ఇవ్వడం పద్ధతిగా వస్తోంది. ఈ ఏడాది భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. క్షేత్రస్థాయిలో రైతులు సాగుపనులకు సన్నద్ధమైనా...అధికారులు మాత్రం కేవలం ప్రణాళికలకే పరిమితమైన వాతావరణం కనిపిస్తోంది.
మూడేళ్లుగా తుఫాన్‌లు, వరదలు రబీ పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి పంటకు పెట్టుబడిగా ప్రభుత్వం కొంత రాయితీని అందించాల్సి ఉంది. రెండేళ్ల క్రితం వచ్చిన నీలం తుఫాన్ నష్టం పెట్టుబడి రాయితీ ఇప్పటికీ పూర్తిస్తాయిలో పంపిణీ కాలేదు. అప్పట్లో సుమారు రూ. 30 కోట్ల రాయితీ జిల్లాకు మంజూరైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.
బ్యాంకు ఖాతాలు, ప్రభుత్వ నిధులు మంజూరులో ఆలస్యం వంటి కారణాలతో రూ. 1.23 కోట్లు ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 2,27,400 హెక్టార్లలో వివిధ పంటలు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఇందుకు మదుపులుగా రైతులకు రూ. 700 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అయితే అధికార పార్టీ ప్రకటించిన రుణమాఫీ ఒక కొలిక్కి రాకపోవడంతో కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదు.
ప్రైవేటు అప్పుల కోసం అన్నదాతలు వెళితే వడ్డీ నెలకు ఐదు రూపాయలకు తగ్గదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏమీ పాలుపోక రైతులు తలలు పట్టుకుంటున్నారు. విత్తనాల విషయానికొస్తే గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది పీఏసీఎస్‌లు, ఆథరైజ్డ్ డీలర్లతో అమ్మకాలు చేయాలని భావించినా, నేటికీ జిల్లాలో సగం మండలాలకు విత్తనాలు చేరని దుస్థితి కానవస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుకు కార్తెలు మొదలైనా, పరిస్థితులు భిన్నంగా ఉండటంతో రైతులు ముందుకు సాగలేక దిగాలుగా ఉన్నారు.