గళం విప్పి.. కదం తొక్కి
కర్నూలును రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ ఉద్ధృతమవుతోంది. రోజుకో రీతిన ఆందోళనతో జిల్లా కేంద్రం అట్టుడుకుతోంది. శనివారం విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.
కర్నూలు(న్యూసిటీ): కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు జిల్లాలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. అందులో భాగంగా శనివారం విద్యార్థులు కదం తొక్కారు. రాజధాని సాధనే తమ ధ్యేయమంటూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసినా ఆందోనకారులు వెనక్కు తగ్గకపోవడంతో అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
కర్నూలును రాజధాని చేయాలని రాయలసీమ ప్రజా సమితి, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్, పీడీఎస్‌యూ విజృంభణ, రాయలసీమ గని కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా, కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు ఉదయమే అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. రాజధాని విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు బి.నాగభూషణం మాట్లాడుతూ కోస్తాంధ్ర నేతలు గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయించుకోవాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. కర్నూలులో రాజధాని కోసం కావాల్సిన నీరు, భూమి, సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. పంద్రాగస్టున ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేసి చేతులు దులుపుకుంటే కుదరదని, రాజధాని గా కర్నూలును ప్రకటించాలని డిమాండ్ చేశారు. సి.వి.రామన్ విద్యా సంస్థల కరస్పాండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విశాలాంధ్ర పేరుతో అప్పట్లో మోసపోయామని చెప్పారు.
మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని కోస్తా ప్రాంతంలో ఉండాలని పట్టుబడుతుండగా ఈ ప్రాంతానికి చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. స్వాతంత్య్రవేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలును రాజధానిగా ప్రకటించకపోతే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించి,లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. కొందరిపై లాఠీచార్జ్ చే సి మూడవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో విద్యార్థి నాయకులు కోనేటి వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసింహా, ఇ.శ్రీనివాసులు గౌడ్, బి. శ్రీరాములు, వసంత్, చంద్రప్పలకు స్వల్ప గాయాలయ్యాయి.
26 మందిని అరెస్టు చేయగా ఐదు మందిపై కేసు నమోదు చేసి తర్వాత విడుదల చేశారు. ఈ మహా ధర్నాలో బీడీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎ.సురేష్ యాదవ్, బి.రాజారత్నం, పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర కన్వీన ర్ నోముల శేషు, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు వి. పోతన, వసంత్, రాయలసీమ గని కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.శివశంకర్, జిల్లా కార్యదర్శి నాగరాజు, రాయలసీమ రాష్ట్ర సమితి కన్వీనర్ సోమశేఖర శర్మ, జిల్లా అధ్యక్షుడు జనార్ధన్, ప్రజా సంఘాల నాయకులు బి.ఎల్లప్ప, న్యాయవాది కె.బలరామ్ తదితరులు పాల్గొన్నారు.