తూకంలో తిరకాసు! | The difference in the electronic Cata | Sakshi
Sakshi News home page

తూకంలో తిరకాసు!

Published Tue, Jun 10 2014 12:29 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

తూకంలో తిరకాసు! - Sakshi

తూకంలో తిరకాసు!

కందుకూరు రూరల్ : పామూరు రోడ్డులో ఉన్న 27వ పొగాకు వేలం కేంద్రంలో కాటాలో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయి. సోమవారం వలేటివారిపాలెం చుండి క్లస్టర్‌కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలానికి తెచ్చారు. కొందరు రైతులు ఇళ్ల వద్ద బేళ్లను కాటా వేసుకుని తీసుకొచ్చారు. వేలం కేంద్రం వద్ద కాటా వేసి బిడ్డింగ్‌లో పెడతారు. కాటా వేసిన బేళ్లను పరిశీలించిన రైతులు తూకంలో  తేడా వచ్చినట్లు గుర్తించారు. 147 కిలోలు ఉండాల్సిన బేలు వేలం కేంద్రం వద్ద కాటాలో 131 కిలోలు మాత్రమే తూగింది. గమనించిన రైతులు తిరిగి కాటా వేయించాలని ముఠా కూలీలపై  ఒత్తిడి తెచ్చారు. రైతులందరూ ఈ విషయంపై పట్టుబట్టారు.
 
దీంతో వేలం నిర్వహణాధికారి శ్రీనివాసులనాయుడు బేళ్లను మళ్లీ కాటా వేయించారు. ముగ్గురు రైతులకు సంబంధించిన బేళ్లలో తేడాలు కనిపించాయి. ఆగ్రహించిన రైతులు ఇలా ఎన్ని బేళ్లలో తేడాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా రోజూ జరుగుతోందా అని అధికారులను నిలదీశారు. అధికారులు, ముఠా కూలీలు, సిబ్బంది కుమ్మక్కై ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఎలక్ట్రానిక్ కాటా కావడంతో రైతులు తూకంలో తేడాను కనిపెట్టలేకపోతున్నారని, దీనిని ఆసరాగా చేసుకుని సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఎలక్ట్రానిక్ కాటాలో తేడా : శ్రీనివాసులనాయుడు, వేలం నిర్వహణాధికారి  
 ఎలక్ట్రానిక్ కాటాలో తేడా వల్ల ఇలా జరిగింది. విధుల్లో అశ్రద్ధగా ఉండే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి నష్టం జరగదు.
 
తూకంలో భారీ తేడా వచ్చింది : కామినేని నరసింహం, రైతు, చుండి
 ఒక బేలు తూకం 131 కిలోలు వచ్చింది. అనుమానం వచ్చి తిరిగి కాటా వేయిస్తే 147 కిలోలు ఉంది. ఈ విషయమై ఎవరిని ప్రశ్నించినా మాకు తెలియదంటున్నారు.
 
రైతులను మోసం చేస్తున్నారు : ఎం.రాఘవయ్య, రైతు
ఒక బేలు 139 కిలోలు ఉంటే 103 కిలోలు మాత్రమే చూపించారు. రైతులను మోసం చేయడం అన్యాయం. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement