srinivasulu naidu
-
మీ ఖాతాలో రూ. 1.84 కోట్లు జమ చేశారు
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రజలు కరెన్సీ కోసం ఇబ్బందులు పడుతుంటే, కొందరు కుబేరుల వద్ద కోట్లాది రూపాయల డబ్బు బయటపడుతోంది. ప్రతి రోజూ విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కోమటికుంట్లకు చెందిన ఓ రైతు బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ చూసి అవాక్కయ్యాడు. శ్రీనివాసులు నాయుడు అనే రైతుకు తాడిపత్రి ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉంది. ఆంధ్రాబ్యాంకు నుంచి ఆయన ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఎకౌంట్లో కోటి 84 లక్షల రూపాయల డబ్బు జమ చేసినట్టు అందులో ఉంది. ఈ విషయం తెలియగానే శ్రీనివాసులు నాయుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తమ దగ్గర అంత డబ్బు లేదని, ఈ మెసేజ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని ఆయన భార్య సుజాత చెబుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాసులు నాయుడి ఖాతాలో ఈ డబ్బు వేసి ఉంటారని భావిస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో బ్యాంకు అధికారులు ఈ విషయంపై స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. -
మదనపల్లెలో మాజీ సైనికుని నిరాహార దీక్ష
అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసు వద్ద మాజీ సైనికులు సోమవారం ఆందోళనకు దిగారు. మదనపల్లె ప్రాంతంలోని 150 మంది మాజీ సైనికులకు స్థలాలు అప్పగిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సంఘం నాయకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఎన్ని విజ్ఞాపనలు అందజేసినా, ఎన్నిసార్లు ఆందోళనలకు దిగినా స్పందించలేదని ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సమస్య పరిష్కారమయ్యేదాకా దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. -
డబ్బు సమీకరణలో మీ వాటా ఎంత?
‘ఓటుకు కోట్లు’ కేసులో టీడీపీ నేత శ్రీనివాసులునాయుడికి ఏసీబీ సూటి ప్రశ్న పొంతనలేని సమాధానాలిచ్చిన శ్రీనివాసులునాయుడు మే 30, 31 తేదీల్లో రేవంత్ నుంచి వచ్చిన కాల్స్‌పై మౌనం ఏడు గంటలపాటు ప్రశ్నించిన అధికారులు విచారణకు విష్ణు చైతన్య డుమ్మా హైదరాబాద్: ‘ఓటుకు కోటు’్ల కేసులో ఆర్థిక మూలాలను ఛేదించేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే కుమారుడు శ్రీనివాసులునాయుడును దాదాపు ఏడు గంటల పాటు అధికారులు విచారించారు. శ్రీనివాసులునాయుడుతోపాటు నోటీసులు అందుకున్న ఆయన పీఏ విష్ణు చైతన్య విచారణకు డుమ్మా కొట్టారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన విచారణలో ప్రధానంగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలతోపాటు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యంపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.150 కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు కొన్ని మార్గాల నుంచి డబ్బు సమీకరణ జరిగినట్లు భావిస్తున్న ఏసీబీ... అందులో భాగంగా టీడీపీ నేత శ్రీనివాసులునాయుడును పిలిచింది. ఈ సందర్భంగా ఆయన్ను ‘డబ్బు సమీకరణలో మీ వాటా ఎంత?’ అని ఏసీబీ సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి ఆయన నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చినట్లు తెలిసింది. పలు సందర్భాల్లో పార్టీ కోసం చేసిన నిధుల సమీకరణను ప్రస్తావించగా.. వాటికి ఆయన సమాధానాలిచ్చినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఫోన్ నుంచి శ్రీనివాసులుకు కొన్ని కాల్స్ వెళ్లడాన్ని ఏసీబీ ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ.. ‘రేవంత్ నాకు మంచి మిత్రుడు’ అని చెప్పినట్లు సమాచారం. రేవంత్‌తో ఎన్నాళ్ల నుంచి స్నేహం కొనసాగుతోందని ప్రశ్నించగా మౌనం వహించినట్లు తెలిసింది. రేవంత్ స్నేహితుడైతే.. కేవలం మే 30, 31 తేదీల్లోనే ఎందుకు ఎక్కువగా కాల్స్ చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నలు కురిపించగా.. వాటికి కూడా శ్రీనివాసులు సమాధానం చెప్పనట్లు సమాచారం. తన పీఏ విష్ణు చైతన్య విచారణకు హాజరుకాకపోవడానికి గల కారణాలను శ్రీనివాసులు ఏసీబీకి వివరించినట్లు తెలిసింది. అయితే ఆ సమాధానాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగానే విష్ణుచైతన్య విచారణకు డుమ్మా కొట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. -
తూకంలో తిరకాసు!
కందుకూరు రూరల్ : పామూరు రోడ్డులో ఉన్న 27వ పొగాకు వేలం కేంద్రంలో కాటాలో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయి. సోమవారం వలేటివారిపాలెం చుండి క్లస్టర్‌కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలానికి తెచ్చారు. కొందరు రైతులు ఇళ్ల వద్ద బేళ్లను కాటా వేసుకుని తీసుకొచ్చారు. వేలం కేంద్రం వద్ద కాటా వేసి బిడ్డింగ్‌లో పెడతారు. కాటా వేసిన బేళ్లను పరిశీలించిన రైతులు తూకంలో తేడా వచ్చినట్లు గుర్తించారు. 147 కిలోలు ఉండాల్సిన బేలు వేలం కేంద్రం వద్ద కాటాలో 131 కిలోలు మాత్రమే తూగింది. గమనించిన రైతులు తిరిగి కాటా వేయించాలని ముఠా కూలీలపై ఒత్తిడి తెచ్చారు. రైతులందరూ ఈ విషయంపై పట్టుబట్టారు. దీంతో వేలం నిర్వహణాధికారి శ్రీనివాసులనాయుడు బేళ్లను మళ్లీ కాటా వేయించారు. ముగ్గురు రైతులకు సంబంధించిన బేళ్లలో తేడాలు కనిపించాయి. ఆగ్రహించిన రైతులు ఇలా ఎన్ని బేళ్లలో తేడాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా రోజూ జరుగుతోందా అని అధికారులను నిలదీశారు. అధికారులు, ముఠా కూలీలు, సిబ్బంది కుమ్మక్కై ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఎలక్ట్రానిక్ కాటా కావడంతో రైతులు తూకంలో తేడాను కనిపెట్టలేకపోతున్నారని, దీనిని ఆసరాగా చేసుకుని సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ కాటాలో తేడా : శ్రీనివాసులనాయుడు, వేలం నిర్వహణాధికారి ఎలక్ట్రానిక్ కాటాలో తేడా వల్ల ఇలా జరిగింది. విధుల్లో అశ్రద్ధగా ఉండే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి నష్టం జరగదు. తూకంలో భారీ తేడా వచ్చింది : కామినేని నరసింహం, రైతు, చుండి ఒక బేలు తూకం 131 కిలోలు వచ్చింది. అనుమానం వచ్చి తిరిగి కాటా వేయిస్తే 147 కిలోలు ఉంది. ఈ విషయమై ఎవరిని ప్రశ్నించినా మాకు తెలియదంటున్నారు. రైతులను మోసం చేస్తున్నారు : ఎం.రాఘవయ్య, రైతు ఒక బేలు 139 కిలోలు ఉంటే 103 కిలోలు మాత్రమే చూపించారు. రైతులను మోసం చేయడం అన్యాయం. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. -
స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అరెస్ట్
తిరుపతి : మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శ్రీనివాసులు నాయుడు అలియాస్ డాను శ్రీను పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు పోలీసులు అతడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇతడు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితుడు.