ముగిసిన ప్రస్థానం | The end of the journey | Sakshi
Sakshi News home page

ముగిసిన ప్రస్థానం

Published Tue, Jan 20 2015 2:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ముగిసిన ప్రస్థానం - Sakshi

ముగిసిన ప్రస్థానం

ప్రజల పక్షాన నిలిచే మహోన్నత నాయకత్వం అస్తమించింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ముగిసింది. నీతి, నిబద్ధత, నైతిక విలువలకు పట్టంకట్టిన వ్యక్తి, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాది పాలడుగు వెంకట్రావు కన్నుమూశారు. సోషలిస్టు భావాలను జీర్ణించుకున్నా నెహ్రూ కుటుంబానికి విధేయుడిగా కాంగ్రెస్‌లో 46 ఏళ్ల్లు రాజకీయాలు నడిపిన ఘనత ఆయన సొంతం. మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన కాకాని వెంకటరత్నం వంటి ఉద్దండుడి శిష్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్సీగా,            ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పదవులు నిర్వహించారు. సంపన్న రైతు కుటుంబంలో పుట్టినా భూ పోరాటాలు చేసి పేదల పక్షాన నిలిచిన  పెద్దాయనగా ప్రజల హృదయాల్లో గుర్తింపు పొందారు.
 
ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే జీవించిన వ్యక్తి, పేదల పక్షపాతి పాలడుగు వెంకట్రావు సోమవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డిసెంబర్ 31న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఈ నెల 9న విజయవాడలో జరిగిన తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అంబులెన్స్‌లో వచ్చి వెళ్లారు. నాలుగు రోజులుగా తీవ్రఅస్వస్థతతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సుశీలాదేవి ఉన్నారు. పిల్లలు లేకపోవడంతో తమ్ముడు కుమారుడిని పెంచుకోగా అతను గతంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. పదవులు ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి రాజకీయ ఉద్దండులైనా కాకాని వెంకటరత్నం, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావు శిష్యరికంలో పాలడుగు రాజకీయాల్లో రాటుదేలారు. నూజివీడు నియోజకవర్గంలో మొదటి నుంచి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు ఆయన. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సన్నిహితుడిగా పాలడుగుకు పేరుంది. తండ్రి పాలడుగు లక్ష్మయ్య కమ్యూనిస్టు భావాలు మెండుగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ పాలడుగు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన రాజకీయ జీవితంలో పలుమార్లు పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించినా సమీకరణలు చేయడంలో దిట్టకాకపోవడంతో ఆ పదవిని అందుకోలేకపోయారు.

నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానం

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు 1940 నవంబర్ 11న నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం గోగులంపాడులో పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ముసునూరు హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్సీ, విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో బీఏ చదివారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ అభ్యసించడంతో పాటు మహాత్మాగాంధీ, మార్క్స్‌పై పీహెచ్‌డీ చేశారు. 1963లో కంకిపాడు సమీపంలోని కోలవెన్నుకు చెందిన సుశీలాదేవిని వివాహం చేసుకున్నారు. అయితే పాలడుగు రాజకీయ ప్రస్థానం 1968లో విద్యార్థి కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ప్రారంభమైంది. 1972 వరకు విద్యార్థి సంఘ నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన ఆయన అదే సంవత్సరం ఎమ్మెల్సీగా ఎన్నికై 1978 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1978లో నూజివీడు ఎమ్మెల్యేగా ఎన్నికై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిగా టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామ్ మంత్రివర్గాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో నూజివీడు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై పౌరసరఫరాల శాఖామంత్రిగా నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. గ్రామీణాభివృద్ధికి చేసిన కృషికి 1982లో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు సైతం అందుకున్నారు. 1991-1992 కాలంలో ఇరాక్ యుద్ధ సమయంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా పౌరసరఫరాలశాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేసినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చి సభ్యుడిగా, ఫిల్మ్‌సెన్సార్ బోర్డు సభ్యుడిగా, పీసీసీ హైపవర్ కమిటీ సభ్యుడిగా, ఏఐసీసీ, పీసీసీ సభ్యుడిగా, పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్‌గా, అధికార ప్రతినిధిగా పాలడుగు బాధ్యతలు నిర్వర్తించారు. భూక్రాంతి పేరుతో భూమి లేని పేదలకు భూములను పంచేలా కృషిచేశారు.   

 - నూజివీడు
 
 రచయితగా..

 ‘పోరాట ప్రస్థానం’, ‘మువ్వన్నెల పోరు’, ‘పోరు-సంక్షేమం’, ‘నాటిత్యాగం-నేటి స్వార్థం-రేపటి ..?’ వంటి పుస్తకాలను పాలడుగు రాశారు. సమకాలీన రాజకీయాలపై ఆయన రాసిన అనేక వ్యాసాలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement