విజయవాడ సిటీ : అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కేసులో తొలి అడుగు పడింది. కేసును సీబీఐకి అప్పగిస్తామంటూ హైకోర్టు చేసిన హెచ్చరికల నేపథ్యంలో గురువారం రాత్రి అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్ డెరైక్టర్ అవ్వాసు వెంకట శేషు నారాయణరావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వారిని శుక్రవారం ఏలూరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లోని లక్షలాది మంది డిపాజిటర్ల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.7 వేల కోట్ల రూపాయల వరకు సమీకరించింది. వేలాది మంది ఏజెంట్లు అగ్రిగోల్డ్ సంస్థకు ఖాతాదారుల నుంచి నగదు డిపాజిట్లు చేయించారు. డిపాజిట్ల కాలపరిమితి ముగిసినా చెల్లింపుల్లో జాప్యం జరగటంతో పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో పలువురు డిపాజిటర్లు 2014 చివర్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు విస్తృతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో సీఐడీ ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇతర రాష్ట్రాల్లోని ఆస్తులను గత ఏడాది జూన్‌లో సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తుల విక్రయం ద్వారా బాధితులకు సొమ్ములు చెల్లించాల్సి ఉంది. దీని కోసం ఆర్థిక వ్యవహారాల కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఆస్తుల వేలానికి సంబంధించి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. పలువురు బాధితులు న్యాయం కోసం హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు దర్యాప్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. గత కొద్ది రోజులుగా సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు అసంతృప్తిగా ఉంది. ఇటీవల సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరు మారకుంటే సీబీఐకి కేసును అప్పగిస్తామంటూ హెచ్చరికలు పంపింది.
దీంతో సీఐడీ అదనపు డీజీపీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు కేసు దర్యాప్తుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేసులోని నిందితులైన వెంకట రామారావు, నారాయణరావును గురువారం సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. వారిని ఏలూరు కోర్టులో హాజరుపరచి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బాధితులు అగ్రిగోల్డ్ నిర్వహకుల అరెస్టుతో ఊరట చెందుతున్నారు.ఇదే వేగంతో ఆస్తుల వేలం ద్వారా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే అప్పుల పాలైన తమను ప్రభుత్వం సత్వర జోక్యం చేసుకొని ఆదుకోవాలనేది బాధితుల కోరిక.
అగ్రిగోల్డ్ కేసులో తొలి అడుగు
Published Sat, Feb 13 2016 12:26 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM