తొండంగి : వేటకు వెళ్లి గల్లంతై, బంగ్లాదేశ్ తీరానికి చేరిన మత్స్యకారులు ఇంకా స్వగ్రామాలకు చేరలేదు. దీంతో వారెప్పుడు వస్తారా అని కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 15, 16 తేదీల్లో మండలంలోని పాతపెరుమాళ్లపురం, హుకుంపేట గ్రామాల మత్స్యకారులు కొన్ని బోట్లపై సముద్రంలో వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను కారణంగా దాదాపుగా 42 మంది వరకూ ఆచూకీ లభించలేదు. అయితే రెండు మూడు రోజులకు కొన్ని బోట్లు విశాఖ, శ్రీకాకుళం, ఒడిశా తీర ప్రాంతాలకు చేరాయి. వీరంతా సంఘటన జరిగిన పది రోజుల్లోనే స్వగ్రామాలకు చేరుకున్నారు. మరో 13 మంది ఆచూకీ తెలియలేదు. చొక్కా సింహాచలం, అర్జిల్లి రాంబాబు, కోడా లోవరాజు, తిత్తి అప్పలరాజు, చొక్కా పెంటయ్య, చొక్కా రాజుల జాడ ఇప్పటికీ తెలియరాలేదు. కోడాపెద్ద అమ్మోరియ్య, మల్లె నందీష్, సూరాడ మసేను, గంట బ్రహ్మేష్, చవాకుల జోగిరాజు, గంటా అడివిరాజుల బోటు బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంది. ఈ విషయాన్ని బాధిత మత్స్యకారులు తమ బంధువులకు సమాచారమిచ్చారు.
50 రోజులవుతున్నా..: గల్లంతైన సంఘటన జరిగి 50 రోజులవుతున్నా, బంగ్లాదేశ్ నుంచి సమాచారం అంది నెల గడుస్తున్నా తమవారిని ప్రభుత్వం స్వగ్రామాలకు తీసుకు రాలేకపోయిందని బాధిత మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మరో వారం రోజులు పట్టవచ్చు : ఎఫ్‌డీఓ చినవెంకటరావు.
సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా గల్లంతై బంగ్లాదేశ్ తీరానికి చేరిన ఆరుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరడానికి మరో వారం రోజుల పట్టొచ్చని తుని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్ చిన వెంకటరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం మత్స్యశాఖ ఉన్నతాధికారులకు బంగ్లాదేశ్ నుంచి సమాచారం అందడంతో సరిహద్దులో ఉన్న మత్స్యశాఖ అధికారులను పంపామన్నారు. త్వరలో వారంతా స్వదేశానికి చేరే అవకాశం ఉందన్నారు.
ఎప్పుడొస్తారో..!
Published Thu, Aug 13 2015 2:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement