అన్నింటా లాస్ట్.. అవుతామా ఫస్ట్!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్:వలసలు, వెనుకబాటుతనంలో అప్పటికీ, ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాదే అగ్రస్థానం.. అభివృద్ధి, తలసరి ఆదాయంలో మాత్రం అట్టడుగు స్థానం. అలాగని సహజ వనరులు లేవా అంటే.. అపారం. పోనీ మానవ వనరుల కొరతా అంటే.. పుష్కలం. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లు అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల మం జూరులో ఇన్నాళ్లూ ప్రభుత్వాలు అనుసరించిన అపసవ్య విధానాలు జిల్లాను చివరి స్థానంలోకి తొక్కేశాయి. పారిశ్రామిక వాడలున్నా చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. రాష్ట్రంలోనే సువిశాల తీరరేఖ ఉన్నా.. తీరం పొడవునా ఇసుక తిన్నెల్లో బంగారం లాంటి ఖనిజ వనరులు అపారంగా ఉన్నా.. మత్స్యసంపద, మత్స్యకారులు పుష్కలంగా ఉన్నా.. వాటి వినియోగం అతి స్వ ల్పం. ఫలితంగా వేలాది జిల్లావాసులు అలో లక్ష్మణా.. అంటూ ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకొని పరుగులు తీస్తున్నారు.
మన రాష్ట్రంతోపాటు చెన్నై, మహరాష్ట్ర, గుజరాత్, కర్నాటక తదితర రాష్ట్రేతర ప్రాంతాల్లో భవన నిర్మాణాలు, హోటళ్లు, ఇతరత్రా పనుల్లో శ్రీకాకుళం జిల్లావాసులే కనిపిస్తారు. జిల్లాలో ఉపాధి లభించకే అరకొర జీతాలకైనా ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. మానవ వనరులు నిర్వీర్యమవుతున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఉపాధి హామీ వంటి పథకాలు పెద్దగా ఉపయోగపడటంలేదు. ఖనిజాధార భారీ పరిశ్రమలు ఏర్పాటుకాకపోవడమే ఈ దుస్థితికి కారణం. నాగావళి, వంశధార, మహేంద్రతనయ వంటి నదులు ఉన్నా మన రైతులు ఇంకా ఒక పంటకే పరిమితమవుతున్నారు. అది కూడా అధిక శాతం వర్షాధారంపైనే. ప్రకృతి వైపరీత్యాలు వర్షాధార పంటలను కబళించి రైతు నోటి కాడి కూడును లాగేసుకుంటున్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఏళ్ల తరబడి సాగుతున్న నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం భారంగా మారింది. రైతులు కూలీలుగా మారుతున్నారు.
జిల్లాలో అటవీ ప్రాంతాలు, గిరిజన జనాభా ఎక్కువే. అటవీ ప్రాంతాల్లో విస్తారంగా పండే అటవీ ఉత్పత్తులకు విలువే లేకుండా పోతోంది. వాటి ప్రాసెసింగ్, నిల్వ సౌకర్యాలు లేక గిరిజన రైతులు అందిన కాడికి దళారులకు అమ్ముకుంటున్నారు. ఇక ఉద్దానం ప్రాంతంలో వేలాది హెక్టార్లలో జీడి, కొబ్బరి తోటలు సాగవుతున్నా.. పరిశోధన కేంద్రాలు గానీ, అనుబంధ పరిశ్రమలు గానీ ఏర్పాటుకు నోచుకోలేదు. జిల్లాలో 192 కిలోమీటర్ల తీర ప్రాంతం, 110కిపైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వేలాది మత్సకారులు వేటాడి తెచ్చే మత్స్య సంపదను నిల్వ చేసే సౌకర్యం లేదు. భావనపాడు ఫిషింగ్ హార్బర్ వంటి ప్రతిపాదనలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఎటువంటి చర్యలు లేవు.
జిల్లాలో చిన్నాపెద్దా 12 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
వీటి సౌకర్యాలు శూన్యం. కొద్దోగొప్పో పారిశ్రామికంగా ఎదుగుతున్న రాజాం ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ లేదు. ఇందుకోసం ప్రతిపాదించిన పొందూరు-రాజాం రైలుమార్గం సర్వేతోనే నిలిచిపోయింది. ఒడిశాలోని ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను విడగొట్టి వేరే జోన్ చేయాలని దీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. దాని సంగతి పక్కన పెడితే రైల్వేపర ంగా జిల్లా రెండు ముక్కలుగా విడిపోయి రెండు రైల్వే డివిజన్లలో చేరడం వల్ల రైల్వేప్రగతి సవ్యంగా సాగడంలేదు. జి.సిగడాం నుంచి పూండి వరకు వాల్తేర్ డివిజన్‌లో ఉంటే.. అక్కడి నుంచి ఇచ్ఛాపురం వరకు ఒడిశాలోని ఖుర్దా డివిజన్‌లో చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా.. చివరి స్థానం శ్రీకాకుళానిదే. అత్యంత వెనుకబడిన జిల్లాగా చెప్పుకొనే ఆదిలాబాద్ జిల్లా తలసరి ఆదాయం కంటే శ్రీకాకుళం జిల్లావాసుల తలసరి ఆదాయం చాలా తక్కువ. అనివార్యంగా ఇప్పుడు కొత్త రాష్ట్రంలోనూ శ్రీకాకుళం చివరి స్థానంలోనే నిలుస్తుంది.