ఐఏఎస్‌ల మధ్య అంతరం | The gap between 'IAS' increased | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ల మధ్య అంతరం

Published Wed, Aug 28 2013 6:02 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM

The gap between 'IAS' increased

వరంగల్: ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని ఐఏఎస్ అధికారులు ఒకరంటే... ఒకరికి గిట్టడం లేదని వివిధ విభాగాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. కొంతకాలంగా కలెక్టర్ జి.కిషన్‌కు, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ వివేక్‌యాదవ్ మధ్య అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఏకంగా తనను బదిలీ చేయాలని కమిషనర్ వివేక్ యూదవ్ ఇటీవలే ఉన్నతాధికారులకు అభ్యర్థన లేఖను పంపించినట్లు తెలిసింది. ఐఏఎస్ కేడర్ కావడంతో జాయింట్ కలెక్టర్‌గా... లేదా... డిస్కమ్ సీఎండీ పోస్టుకు వెళ్లేందుకు తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ కిషన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 
 
 విభాగాల వారీగా నిత్యం సమీక్షలు, సమావేశాలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడంతోపాటు ముక్కుసూటిగా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. అయితే కలెక్టర్ దూకుడు... ఐఏఎస్ కేడర్ నుంచి నేరుగా వచ్చిన అధికారులకు మింగుడు పడడం లేదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. వచ్చిన కొత్తలోనే కలెక్టర్ రెండుసార్లు కార్పొరేషన్‌కు వెళ్లడంతోపాటు ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టారు. దీంతో కమిషనర్ వివేక్‌యాదవ్ నొచ్చుకున్నట్లు బాహాటంగానే జిల్లా అధికారుల్లో చర్చ జరిగింది. స్పెషలాఫీసర్ హోదాలో కలెక్టర్ జూలై ఆరో తేదీన నగరంలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ఆకస్మిక క్షేత్ర పర్యటన చేపట్టారు. అరగంట ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న కమిషనర్ ఆయనను అనునయించారు. 
 
మరో మూడు రోజులకే కలెక్టర్ కార్పొరేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. వేళాపాళ పాటించని, విధులకు రాని 38 మంది ఉద్యోగులకు హాజరు పట్టికల్లో ఆబ్సెంట్ వేశారు. బయోమెట్రిక్ విధానం ఉన్నప్పటికీ అమలు చేయకపోవడంపై మేనేజర్ సహా అక్కడున్న అధికారులపై మండిపడ్డారు. జూలై 25న సుదీర్ఘంగా కార్పొరేషన్‌లోని వివిధ విభాగాలపై సమీక్ష జరిపి.. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇవన్నీ తన ప్రమేయం లేకుండా జరగడంతోపాటు సూటిగా తనను టార్గెట్ చేసినట్లుగా ఉండడంతో  వివేక్‌యాదవ్ మనస్తాపం చెందారని, దీంతో కలెక్టర్, ఆయనకు మధ్య అంతరం ఏర్పడిందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగు తోంది. మరోవైపు రాహుల్ బొజ్జా కలెక్టర్‌గా ఉన్న సమయంలో అన్నీ తానై అన్నట్లుగా క్రియాశీలక పాత్ర పోషించిన జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న సైతం కొంత కాలంగా తన విభాగాల పరిధికే పరిమితమైనట్లు చర్చ జరుగుతోంది. మొత్తంగా ఉన్నతాధికారుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు ప్రభుత్వ విభాగాలన్నీ కోడై కూస్తున్నాయి. ఈ క్రమంలో కమిషనర్, జారుుంట్ కలెక్టర్‌లు బదిలీకి ప్రయత్నాలు చేసుకుంటుండడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement