
మత్స్యకారులపై శీతకన్ను
నిజాంపట్నం: నిజాంపట్నం ఓడరేవులో మత్స్యకారులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. మత్స్యకారులకు నిర్దేశించిన ప్రభుత్వ పథకాలు సైతం వారిని ఆదుకోలేకపోతున్నాయి. ఫలితంగా రోజు వారి బతుకుతెరువు కోసం అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
1980లో నిర్మించిన నిజాంపట్నం ఓడరేవులో నేటికీ కనీస వసతులు ఏర్పాటు చేయలేదు. ఈ కారణంగా దీన్నే నమ్ముకుని బతుకున్న మత్స్యకారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో లంకేవానిదిబ్బ నుంచి బాపట్ల వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. జిల్లాలో మొత్తం 6,812 మత్స్యకార కుటుంబాలు సముద్ర వేటపై ఆధారపడి బతుకుతున్నాయి.
38 ఎకరాల అటవీశాఖ స్థలం లో నిర్మించిన ఈ ఓడరేవు నుంచి రోజుకు సుమారు 20 టన్నుల మత్స్యసంపదను ఇతరప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.
సమస్యల వలయంలో హార్బర్..
ఓడరేవులో వసతులు లేకపోవటంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.
ఓడరేవు చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మించాలని ఎన్నోసార్లు సంబంధిత అధికారులను కోరినప్పటికీ నేటికీ పరిస్థితి అలానే ఉంది.
మంచినీటి సౌకర్యం, వీథి దీపాలు వంటి కనీస వసతులు కూడా కరువయ్యాయి.
నిజాంపట్నం నుంచి ఓడరేవుకు వచ్చే రహదారి పూర్తిగా అధ్వానస్థితికి చేరింది. దీంతో మత్స్య సంపద రవాణా సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అందని డీజిల్ సబ్సిడీ ...
ఓడరేవులో 152 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఈ బోట్లకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై 3 వేల లీటర్ల డీజిల్ ఇస్తోంది. లీటరుకు రూ. 6.03పైసలు సబ్సిడీగా చెల్లిస్తోంది.
2013-14 సంవత్సరానికి సంబంధించిన డీజిల్ సబ్సిడీ నేటికీ అందలేదు. ఒక్కో బోటుకు సుమారు రూ. 18వేల వరకు సబ్సిడీ రావాల్సివుంది. ఇలా మొత్తం కోటి రూపాయల వరకు మత్స్యకారులకు చెల్లించాల్సి ఉంది.
సకాలంలో డీజిల్ సబ్సిడీ రాకపోవటంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డీజిల్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
2013-14 సంవత్సరానికి సంబంధించి డీజిల్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని ఎఫ్‌డీవో వెంకటరామిరెడ్డి తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు .