అనుమానం పెనుభూతమై..
భార్యను కడతేర్చిన భర్త
అనాథలుగా మిగిలిన పిల్లలు
పోలీసుల అదుపులో నిందితుడు!
పెందుర్తి: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. కన్న పిల్లలకు తల్లి ఆప్యాయతను దూరం చేసి వారి జీవితాల్లో విషాదాన్ని నింపా డు. పెందుర్తి సమీపంలోని గాంధీనగర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి.. కరాస ప్రాంతానికి చెందిన వాస గురునాథరెడ్డి, సుజాత(28) దంపతు లు ఆరేళ్ల కిందట గాంధీనగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. అతను తాపీమేస్త్రిగా పనిచేస్తుండగా ఆమె కూలి పనులకు వెళుతోంది. కాగా గురునాథరెడ్డికి భార్యపై అనుమానం ఉంది. దీంతో చాలాకాలంగా ఇరువురికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట భర్త వేధింపులకు తాళలేక ఆమె గృహహింస కేసు పెట్టింది. అప్పట్లో ఇరువురికి పోలీసులు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో మరోసారి మంగళవారం రాత్రి ఇద్దరు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. తాగిన మత్తులో గురునాథరెడ్డి సుజాతను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత తన భార్య ఉరేసుకుందని కేకలు వేశాడు.
అయితే స్థానికులు వచ్చేసరికి అతను పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం డీసీపీ రామ్‌గోపాల్‌నాయక్, ఏసీపీ భీమారావు, సీఐ జె.మురళి ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఆమె మృతదేహాన్ని పరిశీలిం చి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు గురునాథరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. తల్లి హత్యకు గురై, తండ్రి దూరం కావడంతో పిల్లలు విఘ్నేష్, అంజలి అనాథగా మిగిలారు. తల్లి మృ తదేహం వద్ద వారు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సీఐ జె.మురళి కేసు దర్యాప్తు చేస్తున్నారు.