ఎర్ర స్మగ్లర్ల వేటలో సాయుధ పోలీసు బలగాలు
చామలరేంజ్‌లో నాలుగు స్పెషల్ పార్టీలు
వాహనాల తనిఖీ
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చామల అటవీ ప్రాంతంలో పోలీసులపై స్మగ్లర్లు దాడికి దిగిన నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో తలకోన అటవీ ప్రాంతంలోని చామల రేంజ్‌లో సాయుధ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితం ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన కూలీ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అటవీశాఖ సిబ్బందితో కలిసి విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. తలకోన అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసు కాల్పులు, ఇక్కడ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తమిళ కూలీ వివరాలను రెండు రోజులుగా తమిళనాడులోని తిరువణ్ణామలై, వేలూరు, సేలం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో ఎర్రచందనం నరికేందుకు వస్తే కాల్చడానికీ వెనుకాడమనే సంకేతాలను పంపుతున్నారు. తద్వారా తమిళనాడు నుంచి ఎర్రచందనం నరికేందుకు వచ్చే కూలీల సంఖ్యను తగ్గించాలన్న యోచనలో పోలీసులు ఉన్నారు.
కూంబింగ్‌కు నాలుగు పార్టీలు
చామల అటవీ ప్రాంతంలో కూంబింగ్ కోసం నాలుగు స్పెషల్ పార్టీలను మోహరించారు. ఒక్కో పార్టీలో 15 నుంచి 20 మంది సాయుధ పోలీసులు ఉన్నారు. వీరు 24 గంటలూ అడవిలో స్మగ్లర్ల కోసం వేట సాగిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని విచారిస్తున్నారు. తమిళనాడు స్మగ్లర్లకు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు మార్గం ఎవరు చూపుతున్నారనే అంశంలోనూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఏమైనా సహకరిస్తున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా
తమిళనాడు నుంచి వేలూరు మీదుగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిఘా పెంచారు. ఎన్‌కౌంటర్ జరిగిన రోజు నుంచి తమిళనాడు బస్సులు, ఆర్‌టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాల్లో ప్రయాణించేవారిలో అనుమానాస్పదంగా ఉన్న వారిని విచారిస్తున్నారు. పీలేరు పోలీసు సర్కిల్‌లో రాత్రి సమయాల్లో ప్రయాణించే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. అటవీ సమీప ప్రాంతాల నుంచి ప్రధాన రహదారుల్లోకి రాత్రి పూట వచ్చే వాహనాలను జల్లెడపడుతున్నారు. ఎర్రచందనం అక్రమంగా తరలిపోతున్న మార్గాలపై మదనపల్లె డీఎస్పీ, పలమనేరు డీఎస్పీ ప్రత్యేక దృష్టిసారించారు.