అన్నం అడిగితే కర్రలతో బాదారు
గుంటూరు జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీలో ఘటన
30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
మేడికొండూరు(గుంటూరు): భోజనం పెట్టలేదని అడిగినందుకు కర్రలతో విచక్షణా రహితంగా విద్యార్థులను బాదారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల జంక్షన్‌లోని ఓ జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పేరేచర్ల జంక్షన్‌లోని శ్రీలక్ష్మీ నరసింహా కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీని నిర్వహిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ వసతితో ఇక్కడ బోధన చేస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం చేసేందుకు విద్యార్థులు వచ్చారు. వారికి తెచ్చిన భోజనం సరిపోకపోవడంతో హాస్టల్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాసరావును విద్యార్థులు భోజనం పెట్టించమని అడిగారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థులపై విరుచుకుపడ్డారు.
ఈ విషయాన్ని సంబంధిత కళాశాల యాజమాన్యానికి తెలియపరచగా కళాశాల కరస్పాండెంట్ బి.లక్ష్మణరావు, కొంతమంది లెక్చరర్లు అర్ధరాత్రి సమయంలో గుంటూరు నుంచి కార్లలో పేరేచర్లకు వచ్చి విద్యార్థులపై కర్రలతో దాడి చేశారు. సుమారు 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇతర విద్యార్థులు పరిస్థితిని స్థానికులకు చెప్పారు. వారు మేడికొండూరు పోలీసులకు తెలియజేశారు.ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు సత్తెనపల్లి – గుంటూరు ప్రధాన రహదారిపై నిరసనగా బైఠాయించారు. ఘటనా స్థలానికివ వచ్చిన గుంటూరు సౌత్ డీఎస్పీ బి.శ్రీనివాసరావు పరిస్థితిని చక్కదిద్దారు. విద్యార్థులను కొట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.