తుడా చైర్మన్‌కు అవమానం
►అతిథి గృహం వద్ద అడ్డుకున్న పోలీసులు
► సీఎంను కలవకుండానే తిరుగుముఖం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్ నర్సింహయాదవ్‌కు శనివారం ఉదయం ఘోర అవమానం జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లగా మెయిన్ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. తాను తుడా చైర్మన్ అని, పార్టీలో సీనియర్ నాయకుడనని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. లోపలికి పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పలుమా ర్లు నచ్చజెప్పేందుకు నర్సింహయాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
చుట్టూ పార్టీ కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు, మీడియా వారు ఉన్నారని, తాను సీఎంను కలవాల్సిన అవసరం ఉందని బతిమాలినా పోలీసులు ససేమిరా అన్నారు. చిర్రెత్తుకొచ్చి పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మె మీద కూర్చుండిపోయారు. ‘సీఎం బయటకు వచ్చినపుడు మీ సంగతి తేలుస్తా’ అంటూ పోలీసులపై రుసరుసలాడారు. కొద్దిసేపటికి సమాచారం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని అక్కడికొచ్చి ఆయన్ను సముదాయించి లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదట రానని మొండికేసిన నర్సింహయాదవ్ మీడియా చూస్తుండటంతో తప్పదన్నట్లు లోనికి వెళ్లారు. అయితే ఆయన సీఎంను కలిసే అవకాశం లేకుండా వెనుదిరిగినట్లు సమాచారం.
చిన్నాచితకా వాళ్లను పంపరా..
పోలీసుల తీరుపై నర్సింహయాదవ్ ఒక దశలో మండిపడ్డారు. ఎవరెవర్ని లోనికి అనుమతించాలో, ఎవర్ని పంపకూడదో తెలియకుండానే ప్రొటోకాల్ ప్రాధాన్యత మరిచి పోలీసులు వ్యహరించడం దారుణమని తన సహచరుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెల్సింది.